
రాధా తండ్రి వారసత్వం బలంగా ఉన్నా.. దానిని సద్వినియోగం చేసుకుని ప్రజల్లో బలమైన స్థానం సంపాదించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. చాలా మంది రాజకీయ వారసులు కాలక్రమంలో విజయాలు సాధించి, మంచి పేరును తెచ్చుకున్నారు. కానీ రాధా విషయంలో అది కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టిడిపిలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించినా.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ అవకాశం రాలేదు. అనంతరం ఆయనకు రాజ్యసభ లేదా శాసనమండలి అవకాశాలు వస్తాయని ఊహాగానాలు వచ్చినా, అవి నిజం కాలేదు.
రాజకీయాల్లో పదవులు కోరుకోవడం సహజం. అనుచరులు కూడా తమ నాయకులు పదవుల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ రాధా విషయంలో ఇది పని చేయలేదు. వైసిపిలో ఉన్నప్పుడు ఆయన కోరిన నియోజకవర్గం ఇవ్వకపోవడంతో అక్కడ స్థానం కోల్పోయారు. టిడిపిలో చేరినా, పదవి రాలేదు. దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన పదవి లేకుండా కొనసాగుతున్నారు. అయినప్పటికీ, ఆయనపై కాపు వర్గంలో గణనీయమైన అభిమాన భావం ఉంది.
ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు, రాధాకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అవకాశం లేకపోవడంతో, కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆ పదవి కొత్తపల్లి సుబ్బారాయుడి వద్ద ఉంది. ఆయన పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ, ముందుగానే మార్చి రాధాకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ పదవి కేవలం రెండు సంవత్సరాల పాటు మాత్రమే ఉండడం వల్ల, రాధా దీన్ని స్వీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఇది జరిగితే టిడిపిలో కాపు వర్గం మద్దతును బలపర్చడానికి తోడ్పడనుంది.