
తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌తో సంబంధం ఉన్న ఒక ఆడియో సంభాషణ బయటకు రావడం పెద్ద వివాదానికి దారి తీసింది. అది ఎక్కడి నుంచి లీకైందన్న ప్రశ్నలు తలెత్తాయి. ఎమ్మెల్యే ఫోన్ నుంచి వచ్చిందా? లేక ఆ సంభాషణలో పాల్గొన్న టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత ఫోన్ నుంచి వచ్చిందా? అనేది క్లారిటీ లేకపోవడం మరింత సందేహాలకు తావిస్తోంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఆయన ఒక వ్యక్తిని నమ్మి వ్యక్తిగతంగా మాట్లాడగా, ఆ సంభాషణనే బయటకు తెచ్చి "హానీ ట్రాప్"గా మలచినట్లు చర్చ నడుస్తోంది. చిన్న వీక్‌నెస్ కూడా పెద్ద సమస్యను తెచ్చిపెడుతుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. కూటమి ఇమేజ్‌ను దెబ్బతీసే పరిణామం కావడంతో ఇది కూడా చర్చనీయాంశమైంది.
ఇక ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ వ్యవహారం వేరేగా నిలిచింది. ఆయన ఓ టీచర్‌తో ఫోన్‌లో ఘాటు సంభాషణ జరపడం, హెచ్చరించడం దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ఆడియో బయటకు రావడంతో ఆయనకే కాకుండా పార్టీకి కూడా ఇబ్బంది కలిగింది. ఇక్కడ కూడా సమస్య అంతర్గతంగా పరిష్కరించుకునే బదులు, ఫోన్ సంభాషణ వల్ల బయటికి వచ్చి పెద్ద దుమారం రేపింది. ఈ సంఘటనలు అన్నీ కూటమి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. పార్టీ సీనియర్లు ఇప్పుడు ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలి అని లోపల చర్చలు మొదలయ్యాయి. మొత్తం మీద, కూటమిలో అసలు సమస్య ప్రత్యర్థులు కాదు, స్వీయ తప్పులే అని తేలిపోతోంది. నాయకులు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే, పార్టీ లోపలే సమస్యలు పరిష్కరించుకుంటే వివాదాలు తగ్గుతాయి. లేకపోతే, రాబోయే రోజుల్లో ఇలాంటి ఆడియో లీకులు, బహిరంగ అవమానాలు కూటమి ప్రభుత్వానికి పెద్ద మచ్చ తెచ్చేలా ఉన్నాయి.