జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల బరిలోకి దూసుకెళ్లేందుకు సమాయత్తమవుతుంటే, హైదరాబాద్ పాతబస్తీ బలగం అయిన ఎంఐఎం మాత్రం ఇంకా నిర్ణయాత్మకంగా ఏదీ ప్రకటించలేదు. అసలు పోటీ చేస్తుందా? లేక మద్దతు ప్రకటిస్తుందా? అన్న ప్రశ్న చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఎంఐఎం పార్టీ ప్రభావం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేసి, గెలవకపోయినా అత్యధిక ఓట్లు సాధించి తన బలాన్ని చాటారు. ఆయనకు స్థానిక బస్తీల్లో బలమైన మద్దతు ఉన్నట్టు అప్పుడే స్పష్టమైంది.


గత సారి ఈ సీటు నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మాగంటి గోపీనాధ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ సారి కాంగ్రెస్ టికెట్ రేసులో అజారుద్దీన్ పేరు వినిపించడం లేదు. కేవలం మూడు పేర్లు మాత్రమే హైకమాండ్‌కు వెళ్లగా, వాటిలో నవీన్ యాదవ్ పేరును కాంగ్రేస్ ఖరారు చేసింది. గడచిన ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ రంగు ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంఐఎం వైఖరిలో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ మద్దతుదారు నుంచి కాంగ్రెస్ పట్ల సైలెంట్ మిత్రుడిగా వ్యవహరిస్తోంది.

 

దీంతో ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంఐఎం స్వతంత్రంగా పోటీ చేస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది. ఈ కారణంగానే ఎంఐఎం పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు పలకడం ఖాయమని అంచనాలు ఊపందుకున్నాయి. ఎంఐఎం ఈ సీటులో ప్రత్యక్ష పోటీకి దిగుతుందా? లేక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తుందా? అన్నదానిపై పార్టీ నాయకత్వం త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం కాంగ్రెస్ పక్షాన నిలబడుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపనుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: