
తాజాగా ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన తన పార్టీ తరఫున 65 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో చోటు దక్కిన వారందరూ సామాజికంగా, రాజకీయంగా బలమైన, ప్రజలతో అనుబంధం కలిగిన అభ్యర్థులుగా గుర్తింపుపొందారు. ఈ ఎంపికలతో ప్రశాంత్ కిషోర్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగబోతుంది. నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ శైలిలో ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పార్టీలు భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, ప్రజలకు చేరువ కావడానికి వివిధ రకాల హామీలతో, ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి.అయితే, ఈ రేసులో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు మాత్రం వేరు. ఆయన గతంలోనే చెప్పినట్లుగా, తన రాజకీయ ప్రస్థానాన్ని సాంప్రదాయ పార్టీల విధానాలకు భిన్నంగా కొనసాగిస్తున్నారు. ఆయన ప్రతీ చర్యలో కూడా స్పష్టమైన వ్యూహం, క్రమబద్ధమైన ప్రణాళిక కనిపిస్తోంది.
అయితే, ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే ప్రశ్న మాత్రం ఇంకా సస్పెన్స్‌గా మిగిలిపోయింది. రెండో జాబితాలో 60 మందికి పైగా అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ, ప్రశాంత్ కిషోర్ తన సొంత నియోజకవర్గం పేరును మాత్రం ప్రకటించలేదు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.గతంలో ఆయన రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం ప్రస్తుతం ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ బలమైన అడ్డాగా ఉంది. అయితే పీకే (ప్రశాంత్ కిషోర్) తన రెండో జాబితాలో కూడా ఆ నియోజకవర్గాన్ని ఖాళీగా ఉంచడం, ఆయన నిజంగానే అక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా ఇది కేవలం వ్యూహాత్మకంగా ఉంచిన సస్పెన్స్‌నా? అనే చర్చ సోషల్ మీడియాలో వేడెక్కుతోంది.
రాజకీయ విశ్లేషకులు ప్రకారం – “ప్రశాంత్ కిషోర్ ఎప్పుడూ అంచనాలకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తి. ఆయన చేసే ప్రతి చర్య వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంటుంది. రాఘోపూర్ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఆయన చివరి నిమిషం వరకు సస్పెన్స్‌గా ఉంచి, దానిని కూడా ప్రచార హంగుగా మార్చుకోవచ్చని” వారు భావిస్తున్నారు.ఇదే సమయంలో, బీహార్‌లోని ప్రజల్లో జన్ సురాజ్ పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతోందని సర్వేలు సూచిస్తున్నాయి. యువత, మధ్యతరగతి ప్రజలు ప్రశాంత్ కిషోర్ మాటల్లో ఉన్న విజన్‌ని గమనిస్తూ, ఆయన పార్టీని ఒక కొత్త ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.
మొత్తానికి, బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కదలికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన నిజంగా రాఘోపూర్ నుంచి బరిలో దిగుతారా? లేక ఇది అంతా ఆయన “మాస్టర్ స్ట్రాటజీ”లో భాగమేనా? అనేది నవంబర్‌లోనే తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు — ఈ ఎన్నికల్లో పీకే ప్రభావం బీహార్ రాజకీయ రంగాన్ని కదిలించక మానదు.