భారత ఎన్నికల కమిషన్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇటీవల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జమ్మూ & కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌ 6, 2025న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, చట్టపరంగా సాగేందుకు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజాగా భారత ఎన్నికల కమిషన్‌ అన్ని రిజిస్టర్డ్‌ జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలకు, అలాగే ప్రతి పోటీ అభ్యర్థికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా లేదా ఏ ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా విడుదల చేయబోయే ప్రచార ప్రకటనలు  తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ వద్ద ముందుగానే ధృవీకరణ పొందాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


ఇకపై ఎవరైనా అభ్యర్థి లేదా రాజకీయ పార్టీ ఈ ధృవీకరణ లేకుండా ప్రచార ప్రకటనలను విడుదల చేస్తే, ఆ చర్యను ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించి, కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషన్‌ హెచ్చరించింది. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఈ ప్రకటనలను సమీక్షించి, ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ణయిస్తాయి. అదేవిధంగా, సోషల్‌ మీడియా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, కమిషన్‌ మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి అభ్యర్థి తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను నామినేషన్ దాఖలు సమయంలోనే ఎన్నికల అధికారులు వద్ద సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. దీని ద్వారా ప్రచారంలో ఉపయోగించే డిజిటల్‌ కంటెంట్‌ పట్ల పూర్తిస్థాయి పర్యవేక్షణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు.


ఇక ప్రచార ఖర్చుల విషయంలో కూడా కమిషన్‌ స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. **1951లోని ప్రజాప్రతినిధుల చట్టం (Representationa of the people Act, 1951)**లోని సెక్షన్‌ 77(1) ప్రకారం, ప్రతి పార్టీ మరియు అభ్యర్థి ఎన్నికల ముగింపుకు 75 రోజుల్లోపు తమ ప్రచార ఖర్చులను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. ఈ ఖర్చుల్లో వెబ్‌సైట్లకు ఇచ్చిన ప్రకటనలు, చెల్లింపు కంటెంట్‌ అభివృద్ధి, సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ, డిజిటల్‌ ప్రమోషన్‌, మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ఖర్చులు అన్నీ తప్పనిసరిగా వివరించాల్సిందే.ఎన్నికల ప్రక్రియలో సోషల్‌ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కొత్త మార్గదర్శకాలు పారదర్శకత, నైతికత, బాధ్యత అనే అంశాలను బలోపేతం చేయడానికే తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఏ పార్టీ అయినా లేదా అభ్యర్థి అయినా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, అది వారి ఎన్నికల ప్రచారంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


దీంతో సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఇదే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ పార్టీలు తమ డిజిటల్‌ ప్రచార బృందాలను మరింత జాగ్రత్తగా పని చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి. ఇకపై ఎవరైనా నిర్ధారణ లేకుండా సోషల్‌ మీడియా ప్రకటనలు విడుదల చేస్తే, అది వారికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా హెచ్చరించింది. మొత్తానికి, ఎన్నికల కమిషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం భారత రాజకీయ ప్రచార పద్ధతులపై భారీ ప్రభావం చూపనుందనడంలో సందేహం లేదు. ఇది సోషల్‌ మీడియా వినియోగంలో ఒక కొత్త నియంత్రణ దశను ప్రారంభించినట్లు చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: