
కేరళ పర్యటనలో భాగంగా రాహూల్ గాంధి అరేబియా సముద్రంలో ఈతకొట్టారు. మామూలుగా రాహూల్ ఈత కొట్టడంలో పెద్ద విశేషం ఏమీలేదు. అయితే సముద్రంలో పడవమీద ప్రయాణిస్తున్న రాహూల్ హఠాత్తుగా సముద్రంలోకి దూకేశారు. కాకీ ప్యాంటు, బ్లూ టీషర్టు వేసుకున్న మత్య్స కారులతో రాహూల్ మాట్లాడుతు మాట్లాడుతునే ఒక్కసారిగా సముద్రంలోకి డైవ్ చేసేశారు. తమ అధినేత సముద్రంలోకి దూకేస్తాడని ఏమాత్రం ఊహించని మిగిలిన నేతలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రాహూల్ వెంట భద్రతా సిబ్బందితో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ప్రతాపన్ అండ్ కో కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాహూల్ కేరళలో పర్యటిస్తున్నారు. ఆమధ్య తమిళనాడు పర్యటనలో ఉన్నపుడు గ్రామీణ ప్రాంతంలోని యువతతో కలిసి రాహూల్ వంటలు చేయటం బాగా వైరల్ అయ్యింది.
కేరళలో కూడా ఇలాంటివే ఏదో చేస్తారని అనుకున్నారు కానీ ఏకంగా సముద్రంలోకే దూకేస్తారని ఏమాత్రం ఊహించలేదు. జాలర్ల సమస్యలు తెలుసుకునేందుకు వాళ్ళతో కలిసి అగ్రనేత సముద్రంలో కాసేపు ఈతకొడుతు మాట్లాడారు. తర్వాత వాళ్ళతో పాటు పడవలోకి వచ్చేసి చేపల కూరతో కలిపి రొట్టెలు తిన్నారు. అగ్రనేతలు తమ పర్యటనల్లో భాగంగా హఠాత్తుగా జనాల్లోకి వెళ్ళిపోవటం, వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవటం, డ్యాన్సులు చేయటం లాంటివి అరుదుగా జరుగుతునే ఉంటాయి. అప్పుడెప్పుడో ఇందిరాగాంధి కూడా ఇలాగే చేసేవారు. సరే ఎంతమంది దేనికోసం చేసినా అంతిమ లక్ష్యం మాత్రం ఓట్లు వేయించుకోవటమే అన్న విషయంలో అనుమానాలు లేవు.
ఇప్పుడు విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో యువతతో కలిసి వంటలు చేసినా, జాలర్లతో కలిసి సముద్రంలో ఈతకొట్టినా వర్కవుటువుతుందా అన్నదే అసలైన ప్రశ్న. ఈ పనులన్నీ రేపటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాబడుతాయన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపేమో నరేంద్రమోడి సర్కార్ తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మధ్యతరగతితో పాటు యువత, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేస్తోంది. గ్యాస్, పెట్రోలు, డీజల్ ధరలు పెరిగిపోతుండటం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రభుత్వ రంగంలోని యూనిట్లన్నింటినీ ప్రైవేటీకరించేస్తామని స్వయంగా మోడినే ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. మరి ఇలాంటి అనేక అంశాలపై రాహూల్ సీరియస్ గా యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ఉద్యమాలు ఎందుకు చేయకూడదు ? ఉద్యమాలు చేయాల్సిన అనేక అంశాలను స్వయంగా నరేంద్రమోడినే ప్రతిపక్షాలకు అందిస్తుంటే వాటిని పట్టుకుని జనాల్లోకి వెళ్ళటానికి ఎందుకు రాహూల్ వెనకాడుతున్నాడన్నదే అర్ధం కావటంలేదు.