భ‌గ‌వాన్ ర‌మ‌ణుల ద‌ర్శ‌నం కోసం ఎంతోమంది భ‌క్తులు అరుణాచ‌లం వ‌చ్చేవారు. వారిలో విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తులు కూడా ఉంటారు. పిగాట్ అనే యూరోపియ‌న్ మ‌హిళ భ‌గ‌వానుల ద‌ర్శ‌నం కోసం త‌రుచుగా వ‌స్తుండేవారు. ఒక‌రోజు ఆమె ర‌మ‌ణుల‌ను  ఆహార నియ‌మాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడిగారు. అందుకు మ‌హ‌ర్షులు ఇచ్చిన స‌మాధానాలు ఇలా ఉన్నాయి.

భక్తురాలు : ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నుడైన సాధకునికి ఎటువంటి ఆహారం నిర్దేశించబడినది?
మహ‌ర్షులు: సాత్వికము, అది కూడా మితంగా.

భక్తురాలు: సాత్వికాహారం అంటే  ?
మహ‌ర్షులు: రొట్టె, పండ్లు ,కాయగూరలు, పాలు మొదలైనవి.

భక్తురాలు: ఉత్తర భారతదేశంలో కొందరు చేపలు తింటారు. అలా చేయవచ్చా?
మహర్షులు సమాధానం ఇవ్వలేదు.

భ: మా యురోపియన్లకు ఒక విధమైన భోజనం అలవాటు . అది మారిస్తే ఆరోగ్యమే కాక మనసు కూడా బలహీనమ‌వుతుంది. శరీర ఆరోగ్యము చూసుకోవాలి కదా ?
మ: తప్పకుండా.. శరీర బలం తగ్గేకొద్దీ మనోబలం పెరుగుతుంది.

భ: మాకు అలవాటు పడిన భోజనం మారిస్తే  ఆరోగ్యం, మనోబలం కూడా క్షీణిస్తాయి క‌దా!
మ: మనోబలం అంటే మీ ఉద్దేశం ఏమిటి ?

భ: లోకంతో ముడిప‌డిన శక్తి.
మ: ఆహార గుణం మనసుపై ప్రభావం చూపుతుంది. తినే ఆహారమే మనసును పోషిస్తుంది .

భ: అవునా!! అలా అయితే మా యూరోపియన్లు సాత్వికాహారంతో సరిపుచ్చుకోవ‌డ‌మెలా?
మ: (అక్క‌డే ఉన్న ఇవాన్ వెంట్జ్ ను ఉద్దేశించి) మేము తీసుకునే ఆహారమే కదా నీవూ తీసుకునేది? అది నీకు అనుకూలంగా లేదా?

ఇవాన్ వెంట్జ్ : అనుకూలమే. నేను ఈ భోజనానికి అలవాటుపడి పోయాను .
భ: అలా అలవాటు పడని వారి విషయం ఏమిటి?
మ: పరిస్థితుల్లో సర్దుబాటే అలవాటు. ప్రధానమైనది మనసు. నిజమేంటంటే కొన్ని ఆహార పదార్థాలు రుచికరమైనవి, హితమైనవి మనస్సుకు నేర్పాలి. పోషక పదార్థాలు శాకాహారములోనూ ,మాంసాహారము లోనూ రెంటిలోనూ సమృద్ధిగానే ఉన్నాయి. కానీ మనసు తనకు అలవాటైనవాటిని రుచికరమని తలచి ఆ ఆహారాన్ని కోరుకుంటుంది .

భ: ఇదే విధంగా జ్ఞానికి కూడా ఆహార నియమాలు ఉన్నాయా?
మ:  లేవు. ఆయన స్థిరంగా ఉంటాడు. తాను తీసుకునే ఆహారంతో తాను ప్రభావితుడు కాడు.

భ: మాంసాహారం తయారు చేయాలంటే ఏదైనా జీవిని చంపవలసిందే కదా?
మ: యోగసాధనా అహింస అత్యంత ప్రధానమైనది.

భ: మొక్కలకు కూడా ప్రాణముంది కదా ?
మ: అదే విధంగా నువ్వు కూర్చున్న రాతికి కూడా ప్రాణముంది !

భ: మేము క్రమంగా శాకాహారాన్ని అలవాటు చేసుకోవచ్చా?
మ: అవును. అదే మార్గం.

మరింత సమాచారం తెలుసుకోండి: