తెలుగువారికి ఇది శుభవార్త. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రామప్ప గుడికి కేంద్రం నిధులు మంజూరు చేయబోతోంది. కాకతీయుల శిల్ప కళా వైభవానికి చిహ్నంగా నిలుస్తూ ఇటీవల యునెస్కో గుర్తింపు కూడా పొందిన రామప్ప ఆలయానికి కేంద్రం నిధులు మంజూరు చేయబోతోంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిధులు మంజూరు చేసే తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం.. ప్రసాద్‌లో రామప్ప గుడి కూడా చేరింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి మంత్రి జి.కిషన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిధులు మంజూరు చేసే తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకంలో రామప్ప గుడిని కూడా చేర్చినట్టు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖను పంపనున్నట్టు తెలిసింది. ఈ ప్రసాద్ పథకం కింద దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో  ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పించుకోవచ్చు. ఈ పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని కేంద్రం కోరనుంది.  కేంద్ర పర్యాటకశాఖ ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాస్తుదంట.


రామప్ప ఆలయంలో ఈ అభివృద్ధి పనుల్ని రెండేళ్లలో పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ రామప్ప ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. రామప్ప ఆలయం ప్రస్తుతం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలోనే ఉంది. ఈ ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయానికి జులైలో యునెస్కో గుర్తింపు కూడా లభించింది. ఈ గుర్తింపు వల్ల రామప్ప ఆలయానికి విదేశీ టూరిస్టులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది.


టూరిస్టుల రాక పెరిగే అవకాశం ఉన్నందువల్ల అందుకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలను కూడా మెరుగుపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్ పథకం నిధులు వస్తే.. ఆలయం లోపల పనులు కూడా కేంద్ర పురావస్తుశాఖ చేపట్టే అవకాశం ఉంది. ఈ ఆలయం లోపల పనులకు రూ.7 కోట్ల వరకు ఖర్చు పెడతారని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులతో టూరిస్టులకు విశ్రాంతి భవనాలు, హీహెచ్‌సీ, రహదారి విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. ఇక్కడ ఓ మ్యూజియం, శిల్పారామం ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: