ఇంటర్నెట్ డెస్క్: అందాన్ని పెంచుకోవడానికి అన్ని రకాల సాధనాలూ ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. దీంతో యువత తాము ఇంకా అందంగా ఉండాలంటూ తమ సహజ సౌందర్యాన్ని మరచిపోతున్నారు ముఖ్యంగా మోడళ్లు, సినీ తారలు ఈ కోవలో ముందుంటారు. ఈ మధ్య కాలంలో అనేకమంది మోడల్స్ తమ అందాలను సర్జరీలతో మార్చుకుంటున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో పోటీని ఎదుర్కొనేందుకు లక్షల రూపాయలు వెచ్చించి మరీ తమ శరీరాకృతిని అవసరమైనట్లు చెక్కించుకుటున్నారు. తాజాగా మెక్సికోకు చెందిన ఓ మోడల్ ఇలాంటి సర్జరీనే చేయించుకుంది. అయితే ఆ సర్జరీ వికటించడంతో తన ప్రాణాలనే కోల్పోయింది.

మెక్సికోకు చెందిన జోస్లిన్ కానోకు 30 ఏళ్లు. ఆమె అక్కడ మంచి మోడల్. చక్కటి ముఖం, అందమైన శరీరం. కానీ ఆమెకు ఇంకా ఏదో కావాలనిపించింది. ప్రధానంగా తన పిరుదులు ఇంకొంచెం పైకి ఉంటే బాగుండేదని అనుకుంది. అంతే ఫ్లైట్ ఎక్కి వెంటనే కొలంబీయాలో ల్యాండ్ అయింది. అక్కడ ఓ హాస్పటల్‌లో చేరి తన పిరుదులకు బట్ లిఫ్ట్ సర్జరీ చేయించుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ సర్జరీ ఫెయిల్ అయింది. అంతే ఆమె అక్కడే మరణించింది. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. దీనిపై జోస్లిన్ తోటి మోడల్ లిరా మెర్సేర్ స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. అయితే జోస్లిన్ కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఆమె మరణానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. సర్జరీ చేసిన ఆసుపత్రి నుంచి కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు.

ఇదిలా ఉంటే జోస్లిన్‌ను అభిమానులు ముద్దుగా మెక్సికన్ కిమ్ కర్దాషియన్ అని పిలుచుకుంటుంటారు. ఇప్పుడు ఆమె మరణించడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సానుభూతి తెలుపుతూ వేల మంది పోస్ట్‌లు పెడుతున్నారు. సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమత్వంపై మోజు పెంచుకుంటే ఎంత ప్రమాదకరమో తెలిపేందుకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: