
మధ్యప్రదేశ్‌కు చెందిన కార్తీక్ శివహరే, షాదాబ్ ఖాన్ల మధ్య పెద్ద వివాదం రేగింది. అది కూడా ఓ కుక్క విషయంలో. ఆ కుక్క తనదంటే తనదని గొడవపడడం మొదలు పెట్టారు. వారి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఇక ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఎన్నో కేసులతో ప్రతి రోజూ బిజీగా ఉండే పోలీసులు వీళ్ల ‘కుక్క పంచాయితీ’ విని తొలుత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారిద్దరి వాదనలు విన్న తరువాత ఆ కేసు పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి వాదనలు మొత్తం విన్నారు. కానీ పోలీసులకు కూడా ఆ కుక్క ఎవరిదో అర్థం కాలేదు. దీంతో చివరికి వారి వివాదం తీర్చడానికి పోలీసులు ఏకంగా డీఎన్ఏ పరీక్షకు రెడీ అయ్యారు.
కుక్క కోసం పోరాడుతున్న షాదాబ్ ఖాన్.. తాను ఆ లాబ్రడార్ జాతి శునకాన్ని పచ్ మడీ ప్రాంతంలో కొనుగోలు చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి అతడు ఏ షాపులో కొనుగోలు చేశాడో అక్కడకు వెళ్లి దాని తల్లి డీఎన్ఏ తీసుకుని రెండింటినీ పరీక్షించారు. ఈ పరీక్షల్లో రెండు డీఎన్ఏలు సరిపోయాయి. దీంతో ఆ కుక్కను పోలీసులు షాదాబ్‌కే అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఓ కుక్క విషయంలో పోలీసులు ఈ స్థాయిలో దర్యాప్తు చేయడం, నిజానిజాలను తేల్చి కుక్కను అసలైన యజమానికి అప్పగించడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.