గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానానికి పెను సమస్య ఎదురైంది. విమాన ఇంజిన్ ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో వెంటనే ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. ఆ క్షణాల్లోనే వందమంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోవడంతో విమానం గాల్లోకి ఎగరలేకపోయింది. అయితే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం రన్వేపైనే సురక్షితంగా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.


సాధారణంగా టేకాఫ్ సమయంలో చిన్న తప్పిదం జరిగినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కానీ గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఘటనలో పైలట్లు ఆపరేషన్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ సిబ్బందిని సైతం రన్వేపై స్టాండ్‌బైగా ఉంచారు. విమానంలో వందమంది ప్రయాణికులు ఉన్నారు. మొదట ఇంజిన్ ఆగిపోవడంతో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. కానీ కొద్ది క్షణాల్లోనే విమానం రన్వేపై ఆగిపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాము క్షేమంగా ఉన్నామని సమాచారం అందించారు. ఇంజిన్‌లో తలెత్తిన లోపాన్ని సరిచేయడానికి రెండు నుంచి మూడు గంటలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇంజినీర్లు, టెక్నికల్ టీమ్ తక్షణమే పనిలోకి దిగింది. ప్రయాణికుల అసౌకర్యం దృష్ట్యా ఎయిర్ ఇండియా అధికారులు త్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. దానితో ప్రయాణికులు బెంగళూరుకు బయలుదేరేలా చర్యలు తీసుకున్నారు.



ఈ ఘటనతో మళ్లీ విమాన భద్రతపై చర్చ మొదలైంది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు రన్వేపై ఉండటం ఎంతటి ప్రమాదకరమో మరోసారి తేటతెల్లమైంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎయిర్‌పోర్ట్ అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఈ మధ్యే రన్‌వే విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతున్నా.. భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదృష్టవశాత్తూ పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే వందమంది ప్రాణాలు రక్షించబడ్డాయి. కొద్దిసేపు ఊపిరి బిగపట్టేలా చేసిన ఈ ఘటనతో ప్రయాణికులు కంగారుపడ్డా… చివరికి అందరూ క్షేమంగా బయటపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: