మా నాన్న చనిపోయి 15 ఏళ్ళు గడుస్తున్నా.. మా అమ్మ ఆయనని ఇప్పటికీ వెతుకుతూనే ఉంటుంది. అలాగే ఆమె రిటైర్ అయ్యి 22 సంవత్సరాల కాలం గడుస్తున్నా, ఆమె ఆఫీసుకి బయలుదేరుతుంది. నాతో ప్రతిరోజూ వాగ్వాదానికి దిగుతుంది. ఊరికే చిరాకు పడుతుంది. ఏడుస్తుంది.. నవ్వుతుంది.. నిట్టూర్చుతుంది.. క్షమించమని వేడుకుంటుంది... అవును. ఆమె దినచర్య ఇలానే ఉంటుంది.. ఎందుకంటే, ఆమె అందరిలాంటి మామ్మూలు మనిషి కాదు.. ఆమెకు 'డిమెన్షియా' వుంది. అదేనండి, మతిమరుపు అనే మానసిక రోగం. ఆమెను కన్నబిడ్డలా సాకుతున్న ఆమె కూతురు 'దీపాంజనా సర్కార్' మాటలు ఇవి...

 

బాల్యంలో వున్నపుడే, అమ్మపైన లైంగిక దాడి జరిగిందట. అయితే ఈ విషయం, అమ్మ 74 ఏళ్ల వయసులో నాతో మొదటిసారిగా చెప్పి, బాధ పడింది. ఈ దాడి ప్రభావమో ఏమో గానీ.. అమ్మ ఎవరినీ అంత ఈజీగా  నమ్మదు. ఇంట్లో పనిమనుషులు కనిపిస్తే వారి నుంచి తనకేదో ముప్పుందని భావించేది. ఇక ఎవరన్నా బంధువులు వస్తే, వారిని దగ్గరకు రానిచ్చేదికాదు. వారు హంతకులు అని చెప్పేది. అమ్మ వింత ధోరణి మాకు అర్ధమయ్యేదికాదు. ఆ తర్వాత అర్ధమయ్యిది.. అదొక మానసిక రోగమని.

 

నేను అవివాహితను. అమ్మ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. అమ్మతోనే ఉంటాను. ఈ వ్యాధి వచ్చిందని తేలాక నేనే ఆమెకు ఏకైక సంరక్షకురాలిని కావాలనుకొని, ఈరోజు వరకు వివాహం చేసుకోలేదు. ఆమె చర్యలకు, కొన్ని సందర్భాల్లో అమ్మతో చాలా వాగ్వాదానికి దిగేదాన్ని. 'అమ్మ ఎందుకిలా చేస్తోంది' అని నిట్టూర్చేదాన్ని. అమ్మ మానసిక ఆరోగ్యం క్షీణించే కొద్దీ నేను ఓ విషయాన్ని గ్రహించాను... ఇవన్నీ ఆ వ్యాధి లక్షణాలు అని.

 

అయితే, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో డిమెన్షియాకు సంబంధించిన రంగంలో పనిచేస్తున్న ఒక కౌన్సిలర్ నాకు సూచించే వరకు నాకు తెలియదు. అతని సలహాలతో అమ్మను రోజు కౌన్సిలింగ్ చేసేదాన్ని. దానివలన పెద్దగా మార్పులు రానప్పటికీ.. నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఒక్కటే.. అమ్మ ప్రశాంతంగా నిద్రపోవాలని. ప్రతిరోజూ అమ్మకు కొత్తగానే ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో జన్మ! ఏది ఏమైనా అమ్మను నేను విడిచి పెట్టను. ఇపుడు ఆమె నాకు అమ్మ కాదు, నా బిడ్డ. అమ్మకు అమ్మనవ్వడం ఎంతో సంతోషంగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: