కాకరకాయను తలచుకోగానో మనకు గుర్తుకు వచ్చేది చేదు. ఇక కాకర చేదుగా ఉంటుందని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే చాలామంది కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటారు. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వాడుతుంటారు. ఇక ఇది రుచికి చేదుగా ఉండే కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. కనీసం రెండు వారాలకు ఒకసారైనా కాకరకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయతో చేసిన వంటలు తింటే మంచిదని.. ఎన్నో పోషకాలు ఉన్న కాకరకాయ తింటే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. గర్భంతో ఉన్న మహిళలు కాకరకాయను ఇష్టపడకపోతే కాకరకాయపై మొదట ఉప్పు వేసి, తరువాత కడిగి బెల్లంతో కలిపి వండితే రుచికరంగా ఉంటుంది. కాకరకాయ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. కాకరకాయ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. గర్భధారణ సమయంలో గర్భిణి ఆరోగ్యకరమైన బరువు పెరిగేలా కాకరకాయ సహాయపడుతుంది.

ఇక చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాకరకాయలో ఈ మధుమేహాన్ని నివారించగలిగే లక్షణాలు ఉంటాయి. పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు రాకుండా చేసే ఫోలేట్ కాకరకాయలో పుష్కలంగా ఉంటుంది. కాకరకాయ పై తొక్క తీసివేసి చాలామంది వండుకుని తింటూ ఉంటారు. అలా కాకుండా తొక్కతో సహా కాకరకాయను వండితే మంచిది. కాకరకాయను డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలు చాలా సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది. కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: