
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అయ్యారా ? మహేశ్వరిని సిఖ్ఛిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించినట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో సిఖ్ఖిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామిని ఏపి హైకోర్టుకు వేశారట. మహేశ్వరితో పాటు తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను కూడా బదిలీ చేశారట. చౌహాన్ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేశారట. తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ హిమా కొహ్లీని నియమించినట్లు సమాచారం. ఈ బదిలీలతో పాటు ఏపి హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని సుప్రింకోర్టు కొలీజయం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు న్యాయమూర్తులుగా ఎవరున్నా మామూలు జనాలకు పనిలేదు. కానీ ఇక్కడ రాజకీయంగానే కాకుండా ఇతరత్రా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యవహారాల్లోను, రోజువారి పరిపాలనలో కూడా న్యాయవ్యవస్ధ జోక్యం మితిమీరిపోయిందన్న ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి. చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే ప్రస్తుత చీఫ్ జస్టిస్ మహేశ్వరితో పాటు మరికొందరు జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి రాసిన లేఖ దేశంలో సంచలనం సృష్టించింది.
జగన్ లేఖలో ఆరోపణలు చేయటానికి ముందు కొందరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి ఉద్దేశ్యపూర్వకంగానే విరుద్దంగా ఉన్నాయనే అభిప్రాయం జనాల్లో పాతుకుపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన వందలాది పిటీషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించేయటం, ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఏదైనా ఘటన జరిగినపుడు ప్రభుత్వాన్ని విచారణ చేయనీయకుండా కోర్టు అడ్డుకుంటోంది. పిటీషనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేయగానే వెంటనే స్టే ఇచ్చేస్తోంది. విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ సెంటర్ ఘటనలో ఏం జరిగిందో అందరు చూసిందే.
అలాగే అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణ విషయంలో కూడా హైకోర్టు అనూహ్యంగా స్టే ఇఛ్చేయటమే కాకుండా ఎక్కడా ప్రచురణ, చర్యలు జరగకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం దేశంలో పెద్ద దుమారమే రేపింది. ఇటువంటి అనేక ఘటనలను ఉదహరిస్తు జగన్ సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి సీజేతో పాటు కొందరు జడ్జీలు బదిలీ అవుతారంటూ జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఇదే నేపధ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ జేకే మహేశ్వరి బదిలి విషయాన్ని ప్రస్తావించటం సంచలనంగా మారింది. దానికి తగ్గట్లే ఈ నెలాఖరులో బదిలీ అవుతున్నట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. ఇటువంటి అనేక కరాణాలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు మరికొందరు జడ్జీలు కూడా బదిలీ అవుతున్నట్లు వచ్చింది. ఇదే సమయంలో ఈరోజు సాయంత్రం జగన్ హఠాత్తుగా ఢిల్లీకి బయలుదేరుతుండటం కూడా అనుమానాలకు తావిచ్చింది.