
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగానే దేశప్రజల ప్రాణాల రక్షణకు సుప్రింకోర్టు క్రియాశీలకమవటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. బాధాకరమే కాదు కేంద్రప్రభుత్వం సిగ్గుపడాలి. నిక్కచ్చిగా చెప్పాలంటే కరోనా వైరస్ విషయంలో దేశప్రజల రక్షణను ప్రధానమంత్రి నరేంద్రమోడి గాలికొదిలేశారనే చెప్పాలి. ఒకవైపు సెకెండ్ వేవ్ లో వైరస్ విపరీతంగా పెరిగిపోతోంది. కేసులు పెరిగిపోవటమే కాకుండా మరణాలు కూడా అంతకంతకు పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తంమీద ఒక్కరోజులో అత్యధికంగా 3.35 లక్షల కేసులు నమోదైంది మనదేశంలోనే. మొదటినుండి కరోనా వైరస్ ను నియంత్రించటంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యమే ఇఫుడు జనాల ప్రాణాలను తోడేస్తోంది. మొదటి-రెండో దశ మధ్యలో మొత్తం దేశమంతా రిలాక్సుడు మూడ్ లోకి వెళ్ళిపోయింది.
సెకెండ్ వేవ్ ఉదృతంగా ఉంటుందని బ్రిటన్, న్యూజిల్యాండ్, జర్మనీ లాంటి దేశాలను చూసిన తర్వాత కూడా కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. మొదటిసారి ఎంతటి నిర్లక్ష్యం చూపించిందో సెకెండ్ వేవ్ లో కూడా అదే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మొదటి-రెండో దశ గ్యాప్ లో ఆసుపత్రుల సంఖ్యను పెంచుకోలేదు. వెంటిలేటర్ల తయారీ, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యతను, ముందుచూపును గాలికొదిలేసింది. వ్యాక్సినేషన్ ఉత్పత్తి విషయాన్ని పట్టించుకోలేదు. పైగా మనదేశంలో ఉత్పత్తయిన టీకాలను అంతర్జాతీయస్ధాయిలో ఇమేజి పెంచుకునేందుకు విదేశాలకు పంపారు. దేశీయవసరాలను పట్టించుకోకుండా టీకాలను విదేశాలకు పంపిన ఏకైక ప్రధానమంత్రి బహుశా నరేంద్రమోడినేయేమో.
వీటన్నింటి మీద సెకెండ్ వేవ్ పెరిగిపోతున్న విషయం తెలిసి కూడా కేవలం ఎన్నికల ప్రచారం మీద మాత్రమే మోడి దృష్టి పెట్టారు. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగానే ఇపుడు దేశం మూల్యం చెల్లించుకుంటోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తు కూర్చోలేకే చివరకు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే కేంద్రంపై మండిపోయారు. ఎమర్జెన్సీ నాటి పరిస్ధితులే దేశంలో కనబడుతోందని, కేంద్రం పట్టించుకోకపోతే తామే రంగంలోకి నేరుగా దిగాల్సొస్తుందని హెచ్చరించిన తర్వాతే సమస్యపై మోడి కాస్త దృష్టిపెట్టారు. ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి, సరఫరా విషయాలపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సుప్రింకోర్టు జోక్యం చేసుకోకపోతే ఎన్నికల ప్రచారంలో పశ్చిమబెంగాల్లోనే బిజీగా గడిపేస్తుండేవారే అనటంలో సందేహంలేదు.