
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఆ విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. అస్సాం, పాండిచ్చేరిలో తప్ప ఇంకెక్కడా బీజేపీ ఆటలు సాగలేదు. అస్సాంలో అంటే ఇప్పటికే అధికారంలో ఉందికాబట్టి దాన్ని నిలబెట్టుకుంది. ఇక పాండిచ్చేరిలో స్ధానికంగా ఉన్న పార్టీలతో జతకట్టి అధికారంలోకి వచ్చింది. అయితే పెద్దరాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో మోడి, అమిత్ షా ద్వయం ఆటలు సాగలేదు. నిజానికి చాలా రాష్ట్రాల్లో తనంతట తానుగా బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కడైతే ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ మోడి, అమిత్ రాజకీయం ఏమాత్రం పనిచేయలేదన్న విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. ధక్షిణాదిలో తీసుకుంటే ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఏపిలో బలమైన వైసీపీని ఢీకొనేంత సీన్ బీజేపీకి లేదు. రాష్ట్రంమొత్తం మీద ఒక్క ఎంపిగానీ ఒక్క ఎంఎల్ఏ సీటు కూడా లేదు. అలాగే తెలంగాణాలో కేసీయార్ బలంగానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీయార్ చేసిన తప్పుల వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇక కేరళలో తాజా ఎన్నికల్లో బీజేపీ స్కోరు గుండుసున్నా. తమిళనాడులో నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది. గోవాలో కాంగ్రెస్ కు మెజారిటి సీట్లు గెలిచినా అధికారంలోకి బీజేపీ వచ్చేసిందంటేనే ఎంత మాయ చేసిందో అర్ధమైపోతోంది. ఇక కర్నాటకలో అధికార కాంగ్రెస్-జేడీఎస్ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి కూటమిలో చీలికలు తెచ్చి ప్రభుత్వాన్ని కూల్చేసింది అధికారంలోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ లో కూడా సేమ్ టు సేమ్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను ప్రలోభపెట్టి లాక్కుని ప్రభుత్వాన్ని కూల్చేసి తాను అధికారంలోకి వచ్చింది. సిక్కిం, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రాజకీయమే చేసింది. సో దీన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే ఏ రాష్ట్రంలో అయితే ప్రాంతీయపార్టీ బలంగా ఉందో అక్కడెక్కడా మోడి, అమిత్ షా పాచికలు పారటంలేదు. కాంగ్రెస్ ఉనికిలో లేనిచోట, ప్రాంతీయ పార్టీలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే మోడి, అమిత్ రాజకీయం నడుస్తోంది. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే బీజేపీని బలమైన ప్రాంతీయపార్టలు వాయించేస్తున్నాయని.