జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లలను ఆదుకునేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. నిన్న అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించిన పవన్.. బాధిత కుటుంబాలను ఓదార్చి అండగా ఉంటామన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పన సాయం అందించే కార్యక్రమాన్ని జనసేనాని పవన్‌ కల్యాణ్ రాయలసీమలో ప్రారంభించారు.


అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నిన్నంతా పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న పవన్... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొత్తచెరువు వెళ్లారు. అక్కడ  ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఓదార్చారు. లక్ష రూపాయల చెక్కు అందించారు. ఆ తర్వాత ధర్మవరం శివనగర్‌లో బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతు రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.


ధర్మవరం మండలం గొట్లూరు, బత్తలపల్లిలోనూ చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి... ఆర్థిక సాయం అందించారు. అనంతపురం జిల్లా మన్నీలలో కౌలు రైతు కుటుంబాలతో రచ్చబండ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్... అధికారంలో లేకపోయినా కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలను ఆదుకునేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు జనసేన ప్రయత్నిస్తోందన్నారు పవన్ కల్యాణ్. అయితే.. తమ పట్ల వైసీపీ అగ్ర నాయకత్వం దారుణంగా మాట్లాడుతోందని పవన్ విమర్శించారు. తనను సీబీఎన్‌ దత్తపుత్రుడని విమర్శిస్తున్న జగన్ .. తాను స్వయంగా సీబీఐ దత్త పుత్రుడని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. మొత్తానికి పవన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: