తెలంగాణలో  రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి .. అక్కడి నుంచి ఇక్కడికి జంపింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇంకెంత జోరుగా సాగుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. లోక్ సభ ఎన్నికల తర్వాత ఇవి తారాస్థాయికి చేరతాయి అని మాత్రం చెప్పగలరు.


అయితే కవిత అరెస్టు, మోదీ ర్యాలీలు తదితర పరిణామాల మధ్య ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అందుకు బీఎస్పీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు.


అయితే సరిగ్గా వారం క్రితం బీఆర్ఎస్, బీఎస్పీ ల మధ్య లోక్ సభ ఎన్నికలకు పొత్తు కుదిరింది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనక్కి తగ్గలేదు. పైగా శుక్రవారం నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ సీట్లను కూడా కేసీఆర్ బీఎస్పీకి కేటాయించారు. అయితే ఈ లోగా ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా అనంతరం ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం అయ్యారు. త్వరలో ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.


ఇదిలా ఉండగా.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ఏజెంటే అని ఆయన బీఎస్పీలో చేరిన ప్రారంభంలో మాటలు వినిపించాయి. దళిత వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చాలని ఆయన పనిచేస్తున్నారని పలువురు ఆరోపించారు. సరిగ్గా 2019లో ఏపీలో పవన్ కల్యాణ్ కూడా ఇలానే చంద్రబాబుకి అనుకూలంగా పనిచేశారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. జగన్ ని గద్దెని ఎక్కనివ్వను అంటూ పవన్ మాట్లాడిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ తన ముసుగు తీశారని పలువురు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rsp