దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ కోసం ఆయన తరఫు లాయర్లు తీవ్రంగా శ్రమించినా ఉపయోగం లేకుండా పోయింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈడీ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. అయితే ఏయే అంశాల మీద ప్రశ్నలు అడుగుతున్నారు? ఆయన ఏం చెబుతున్నారు? అనే విషయాలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు.


అయితే అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్న వ్యక్తి అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ అధికారుల కస్టడీలో ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఆయనపై  తాజాగా దేశ ద్రోహం ఆరోపణ వేలాడుతోంది. అదేంటంటే.. ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలీస్తానీ గ్రూప్స్ నుంచి రూ.133.54 కోట్లు ముట్టజెప్పారని వెల్లడించారు. 2014లో అర్వింద్ కేజ్రీవాల్ తమతో ఓ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించాడు.


1993లో దిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో దోషి అయిన దేవీందర్ పాల్ సింగ్ భుల్లార్ ను రీలీజ్ చేయిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చినట్లు గురు పత్వంత్ సింగ్ పన్నూ తెలిపాడు. అలా చేయాలంటే.. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వివరించాడు. ఈ మేరకు గురు పత్వంత్ సింగ్ పన్నూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో ఖలీస్తానీ గ్రూపుతో ఉన్న సంబంధాన్ని ఆయన వివరించాడు.


1993 దిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఖలీస్థానీ తీవ్రవాది పాల్ సింగ్ భుల్లార్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత జీవిత ఖైదీగా మార్చింది. దీంతో అతను 20 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. కాగా ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదేమీ కొత్తకాదు. కాకపోతే ఇప్పుడు చేసిన ఆరోపణలు దేశ ద్రోహం కిందకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: