యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసింది మూడు చిత్రాలే కానీ ఆయన టాలీవుడ్ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. చదువుల్లో రాష్ట్ర స్థాయిలో రాణించిన ఆయన క్రికెట్ క్రీడలో జిల్లా స్థాయిలో రాణించారు. ఇటీవల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచి ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో అతను ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో ఆయన సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు కావాలన్న కోరికతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ కావాలని భావించారట. ఇందుకోసం ఆయన ఒక దర్శకుడి వద్దకు వెళ్లారట. అయితే సదరు దర్శకుడు ప్రశాంత్ వర్మ ని చాలా సేపు వెయిట్ చేయించారట. అంతేకాదు, మంచినీళ్లు కూడా తెప్పించారట. ఆ సమయంలోనే ప్రశాంత్ వర్మ చాలా బాధపడ్డారు. ఇంత చదువు చదివి.. ఇలాంటి పనులు చేయాల్సిన ఖర్మ పట్టింది ఏంటి అని ఆయన చాలా బాధ పడ్డారట.



ప్రశాంత్ వర్మ తనకు ఎదురైనా మరొక చేదు అనుభవం గురించి కూడా వివరించారు. ఒక స్టార్ హీరోకి కథ చెబుదామని వెళ్తే ఆయన ఇంటి గేటు ముందు వెయిట్ చేయాలని ఫోన్ లో చెప్పారని ప్రశాంత్ వర్మ తెలిపారు. అలా వేచి చూస్తున్న సమయంలోనే వర్షం పడటం ప్రారంభమైందని.. అప్పుడు సదరు హీరో తనని కిటికీలోనుంచి చూస్తున్నారని.. కనీసం లోపలికిరా అని కూడా తనని పిలవలేదని.. ఆ క్షణంలో ఆ హీరోపై పట్టరాని కోపం వచ్చిందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. సదరు స్టార్ హీరో లోపలికి పిలిచేంత వరకు గేట్ బయట వర్షంలో తడిసిన ప్రశాంత్ వర్మ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కథ చెప్పి వచ్చారట. ఇక ఆ తర్వాత సదరు హీరోతో కలిసి తాను సినిమా చేశానని ప్రశాంత్ వెల్లడించారు.



ప్రశాంత్ తనని అవమానించిన హీరో పేరు వెల్లడించలేదు. కానీ ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే. ఆ మూడు సినిమాల్లో మొదటిది లేడీ ఓరియంటెడ్ కాగా.. మూడవది జాంబీ రెడ్డి. ఈ రెండు సినిమాల్లో ఏ స్టార్ హీరో కూడా నటించలేదు. కానీ ఆయన తీసిన 2వ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించారు. దీన్నిబట్టి ప్రశాంత్ ని ఇంటి బయట వర్షంలో నిల్చోబెట్టిన హీరో రాజశేఖరేనని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: