కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి సాయి ధన్షిక తో ఈ ఏడాది ఆగస్టు 29న విశాల్ వివాహం జరగబోతోంది. ఈ విషయంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. అయితే పెళ్లికి ముందే విశాల్ కు అనుకోకుండా ఓ బిగ్ షాక్ తగిలింది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో విశాల్ కు గత కొన్నాళ్ల నుంచి ఆర్థిక వివాదం నడుస్తోంది. అయితే ఈ వివాదంలో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు విశాల్ కు మింగుడు పడడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


2016లో విశాల్ `మరుదు` సినిమా నిర్మాణం కోసం లైకా అనుబంధ సంస్థ దగ్గర నుండి రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును విశాల్ తీర్చే వరకు అత‌ను నిర్మించే సినిమా హక్కులన్నీ తమకు చెందే విధంగా లైకా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి విశాల్ త‌న `వీరమే వాగై సూదుం`(తెలుగులో సామాన్యుడు) సినిమా హక్కులను ఇతర సంస్థలకు విక్ర‌యించాడు. ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ప్రొడక్షన్స్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో విశాల్ చిక్కుల్లో ప‌డ్డారు.


చాలా కాలం నుంచి విశాల్ - లైకా కేసు కోర్టులో నడుస్తూ ఉంది. కేసును విచారించిన హైకోర్టు.. గతంలో వెంటనే రూ. 15 కోట్లు లైకా సంస్థ‌కు కట్టాలని విశాల్ కు ఆదేశించింది. కానీ విశాల్ డబ్బులు లేవంటూ కోర్టు ఆదేశాల‌ను ధిక్కరించాడు. ఇదే విష‌యాన్ని తెలుపుతూ లైకా సంస్థ మ‌రో కేసును దాఖలు చేయ‌గా.. దీనిపై కోర్టు విచార‌ణ జ‌రిపి విశాల్‌ను మందలించింది. త‌న ఆస్తుల వివరాలను సమర్పించాల‌ని ఆదేశించింది. ఇక రెండున్నరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం.. తాజాగా హైకోర్టు లైకా సంస్థ‌కు అనుకూలంగా ఫైన‌ల్ జ‌డ్జ్‌మెంట్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్‌కు రూ.21.29 కోట్ల అప్పుతో 30శాతం వడ్డీ మ‌రియు న్యాయపరమైన ఖర్చులను కలిపి మొత్తం చెల్లించాలని విశాల్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్థికంగా విశాల్ కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: