
మొదటి షరతు కాల్ షీట్ సమయానికి సంబంధించినది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే 12 గంటల పనిని రెగ్యులర్ వర్కింగ్ అవర్స్‌గానే పరిగణించాలని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు కాల్‌షీట్ ఎక్కువగా ఉంటే కార్మికులకు అదనంగా వచ్చే వేతనం ఒక ప్రధాన ఆదాయం. కానీ ఈ కొత్త షరతు వల్ల ఆ అదనపు సంపాదన కోల్పోతామని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండో షరతు డబుల్ పేమెంట్స్ పై ఉంది. ఇప్పటి వరకు ప్రతి ఆదివారం పనిచేసినా డబుల్ పేమెంట్స్ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగింది. కానీ ఇప్పుడు నిర్మాతలు ఈ విధానాన్ని పరిమితం చేయాలని నిర్ణయించారు. అంటే నెలలో రెండో ఆదివారం, అలాగే కార్మికశాఖ ప్రకటించిన పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో మాత్రమే రెట్టింపు వేతనం ఇస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో కార్మికుల ఆదాయం తగ్గిపోతుందని, ఇది తమ జీవన విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని యూనియన్లు అంటున్నారు.
మూడో షరతు ఫైటర్స్ మరియు డాన్సర్స్ రేషియోలకు సంబంధించినది. 2022 జులైలో రెండు వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఫైటర్స్, డాన్సర్స్ వర్గాల్లో వేతనాలు మరియు రేషియోలు 2023 సెప్టెంబర్ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అది ఇప్పటివరకు అమలు కాలేదని, తప్పనిసరిగా వెంటనే అమలు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ లేఖలో స్పష్టం చేసింది. చివరిగా, నాలుగో షరతు నిర్మాతల స్వేచ్ఛపై ఉంది. ఒప్పందంలోని జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం, నిర్మాతలు తమ సినిమాకు కావలసిన నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారని లేఖలో పేర్కొన్నారు. ఇది అమల్లోకి వస్తే ముఖ్యంగా చిన్న సినిమాలకు ఎంతో మేలు జరగనుంది. ఎందుకంటే, చిన్న బడ్జెట్‌తో సినిమా చేస్తున్న వారు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేసే యూనియన్ సభ్యుల కంటే, తక్కువ ఖర్చుతో నాన్ యూనియన్ సభ్యులను కూడా పని కోసం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ నాలుగు షరతులు ఇప్పుడు సినీ పరిశ్రమలో కొత్త వివాదానికి దారితీశాయి. నిర్మాతలు వీటిని తప్పనిసరి అంటుండగా, కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరు వర్గాలూ కొంత వెనక్కి తగ్గకపోతే సమస్య పరిష్కారం కష్టమేనని కనిపిస్తోంది.