బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ‘పరం సుందరి’ జాన్వీ కపూర్‌కు పెద్ద నిరాశే మిగిల్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారడం ఆమె కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలినట్టే. ప్రమోషన్స్‌లో జాన్వీ ఎంత కష్టపడ్డా, సినిమాలో ఆమె నటనకు ఆశించినంత మార్కులు పడలేదు. ఫలితంగా ఈ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ఆమె పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు తెలుగులో చేసిన ‘దేవర’ హిట్ అయినా వ్యక్తిగతంగా జాన్వీకి పెద్దగా ఉపయోగం కాలేదు. ఎందుకంటే, ఆ సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యం తక్కువగా ఉండటమే కారణం. ‘దేవర 2’లో ఆమెకు ఎక్కువ స్కోప్ ఉంటుందని సమాచారం. కానీ ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి.


ఈలోగా జాన్వీకి మరో పెద్ద అవకాశం దొరికింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో కథానాయికగా ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో మరో కీలక మెట్టు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఉప్పెన’లో కథానాయిక పాత్రకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అందరికీ తెలిసిందే. అయితే, ‘పెద్ది’ మాత్రం లవ్ స్టోరీ కాదు, ప్యూర్ యాక్షన్ డ్రామా. ఇలాంటి కథలో హీరోయిన్ పాత్రకు పెద్ద స్కోప్ ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి ‘దేవర’లోనూ తలెత్తింది. భారీ స్పాన్ ఉన్న కథలో జాన్వీ పాత్ర తేలిపోవడంతో ఆమె నిరాశ చెందాల్సిన ప‌రిస్థితి.


ఇప్పుడు ‘పెద్ది’లోనూ అదే పునరావృతం అయితే జాన్వీ ఆశలపై మరోసారి నీళ్లు కుమ్మ‌రించిన‌ట్టు అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే. పాత్ర పరంగా పెద్ద స్కోప్ లేకపోయినా, తన లుక్స్, స్టైల్, గ్లామర్ అప్‌పీల్‌తో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే మాత్రమే ఈ సినిమా ఆమె కెరీర్‌కు బూస్ట్ అవుతుంది. జాన్వీ ఇప్పటివరకు హిందీలో ఊహించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయినా, ఆమె ప్రయత్నం మాత్రం ఆగలేదు. శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ఒక్కో అడుగు వేసుకుంటూ తన కెరీర్‌ని గాడిలో పెట్టుకోవాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: