మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. మెదక్ జిల్లా అచ్చంపేట వ‌ద్ద అసైన్డ్ భూముల‌ను క‌బ్జా చేశార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశాడు. ఈ అంశం అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారాల్సింది పోయి ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త విబేధాల‌కు తావునిస్తోంది. సొంత పార్టీ పెట్టుకొనేందుకు ఈట‌ల దూకుడుగా ముందుకెళ్తుంటే .. కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఈట‌ల‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు అతి ఉత్సాహం చూపుతున్నార‌ట‌.

ఈట‌ల వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ నేత‌లు రెండువ‌ర్గాలు చీలిపోయిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈట‌ల‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావాల‌ని ఓ వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తుండ‌గా, భూ క‌బ్జాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని పార్టీలోకి ఎలా తీసుకొస్తార‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల కాంగ్రెస్‌లోకి వ‌చ్చేందుకు  సుముఖంగా ఉన్నారా? లేదా? అన్న‌విష‌యం ప‌క్క‌కు పెడితే.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఈట‌ల విష‌యంలో అంత‌ర్గ‌తంగా ఓ చిన్న‌పాటి యుద్ధ‌మే జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ముఖ్య‌నేత ఈట‌ల‌కు అండ‌గా బీసీ కార్డు నినాదంతో మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాడ‌ని, దీని వ‌ల్ల రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని కౌశిక్‌రెడ్డి ఆవేద‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈట‌ల త‌ప్పిదాల‌ను ఎత్తిచూపుతూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేయాల్సింది పోయి ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని స‌ద‌రు సీనియ‌ర్ నేత తీరుపై కౌశిక్ రెడ్డి అధిష్టానం వ‌ద్ద ఫిర్యాదుసైతం చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ వ్యూహాల‌తో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల బ‌ల‌హీన ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ నుంచిసైతం ఈట‌ల‌కు వ్య‌తిరేఖంగా ప్ర‌జ‌ల్లోకి వెళితే మ‌న క్యాడ‌ర్‌ను మ‌నం కాపాడుకోవ‌చ్చ‌ని కౌశిక్‌రెడ్డి అధిష్టానం పెద్ద‌ల వ‌ద్ద తెలిపిన‌ట్లు తెలుస్తోంది. ఈట‌ల విష‌యంపై ఏదో ఒక‌టి తేల్చాల‌ని, అలా కాకుండా కొంద‌రు ఈట‌ల‌కు మ‌ద్ద‌తు, మ‌రికొంద‌రు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల క్యాడ‌ర్‌లో అయోమ‌యం నెల‌కొంటుంద‌ని, ఫ‌లితంగా మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని యువ‌త‌నేత పేర్కొన్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈట‌ల వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ నేత‌లంతా ఒకేస్టాండ్ మీద‌కు వ‌చ్చేలా అధిష్టానం ఏమేర‌కు చొర‌వ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: