విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేశినేని భవన్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో చంద్రబాబు, ఏడు నియోజకవర్గాల ముఖ్య నేతల ఫోటోలను తొలగించి.. ఆ స్థానంలో రతన్‌ టాటాతో కేశినేని నాని కలిసి ఉన్న ఫోటోలు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఏడు నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులు, నాయకుల ఫోటోల స్థానంలో.. తాను గత ఐదేళ్లలో చేసిన సేవా కార్యక్రమాల ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఫోటోను తొలగించి.. ఆ స్థానంలో రతన్‌ టాటా కలిసి ఉన్న ఫోటోను ఉంచడం వాడివేడి చర్చకు దారితీసింది.

నిజానికి విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం తెలుగునాట హాట్ టాపిక్‌ అయ్యింది. ఆయనతో పాటు గుంటూరు టీడీపీ పార్లమెంట్‌ సభ్యుడు గల్లా జయదేవ్ కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం హోరెత్తింది. ఈ క్రమంలోనే విజయవాడలోని కేశినేని భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫొటో తొలగించారన్న వార్తతో ఈ ప్రచారం పతాక స్థాయికి చేరింది. అయితే అసలు ఏం జరిగింది? చంద్రబాబు ఫొటోను తొలగించడానికి వెనకున్న కారణాలు వంటి వాటిని తెలుగుదేశం పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారనే ప్రచారంపై విజయవాడ టీడీపీ నేత ఫతావుల్లా స్పష్టత ఇచ్చారు. నగరంలోని కేశినేని భవన్ వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫొటో తొలగింపు వెనుక అసలేం జరిగిందనే విషయాన్ని వివరించారు. కేశినేని భవన్‌లో ఒక ఛాంబర్‌లో కేవలం చంద్రబాబు ఫొటోను మాత్రమే మార్చారనీ, కార్యాలయం వెలుపల, లోపల తక్కిన గదులలోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ఫొటోలు యధావిధిగా ఉంచారని ఫతావుల్లా తెలిపారు. ఇక కేశినేని భవన్ చుట్టుపక్కల, లోపల కూడా చంద్రబాబు, ఇతర నేతల ఫ్లెక్సీలు సైతం అలాగే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఎంపీ కేశినేని నాని ముఖ్య అనుచర వర్గం కేశినేని భవన్‌లో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఇటీవల జరిగిన ఫ్లెక్సీల తొలగింపు, పార్టీలో కేశినేని నాని అనుచరులకు ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చించింది. అయితే కేశినేని నాని త్వరలో బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేశినేని నాని అనుచర వర్గం ధృవీకరించడం లేదు. దీంతో టీడీపీలో గందరగోళం సృష్టించడానికే పార్టీ వ్యతిరేకులు, కేశినేని రాజకీయ శత్రువులు ఇలాంటి ప్రచారాన్ని సృష్టించారన్న చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: