ఖమ్మం బహిరంగసభలో చంద్రబాబునాయుడు ప్రసంగం విన్నతర్వాత చాలామంది మాజీ తమ్ముళ్ళలో కలిగిన అనుమానం ఇదే. ఎనిమిదిన్నరేళ్ళ తర్వాత పార్టీ నిర్వహించిన బహిరంగసభలో  చంద్రబాబు పాల్గొనటం ఇదే మొదటిసారి. అదికూడా ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఎలా మాట్లాడాలి. ప్రత్యర్ధులపై పంచులతో రెచ్చిపోవాలి. తెలంగాణాలో ఓట్లడిగే అర్హత టీడీపీకి తప్ప మరోపార్టీకి లేదని చెప్పిన చంద్రబాబు మరి ప్రత్యర్ధులపై కనీసం ఒక్కమాట కూడా ఎందుకని మాట్లాడేలేదు ?





కేసీయార్, బీజేపీ, కాంగ్రెస్ పై ఆరోపణలు చేయటానికి, విమర్శలు చేయటానికి కూడా ధైర్యం చేయలేదు. ఈరోజు బహిరంగసభలో ప్రత్యర్ధులపై మాట్లాడటానికే భయపడిన చంద్రబాబు రేపటి ఎన్నికల ప్రచారంలో ఇంకేమి మాట్లాడగలరు అని తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. తమ్ముళ్ళు విశ్లేషణలు ఎందుకు చేస్తున్నారంటే టీడీపీ వల్ల లాభపడిన వాళ్ళు, టీడీపీలో ఉండి అనేక పదవులు అనుభవించిన వాళ్ళందరు తిరిగి పార్టీలోకి వచ్చేయాలని పిలుపిచ్చారు కాబట్టే.





నిజానికి ఖమ్మం బహిరంగసభలో పాల్గొనటానికి చంద్రబాబు ముందు ఇష్టపడలేదని సమాచారం. టీడీపీ సభ ముసుగులో రెండు రాష్ట్రాల్లోని కమ్మ సామాజికవర్గంలోని కీలక నేతలు, ప్రముఖులు ఒకటికి రెండు సార్లు సమావేశమై ఒత్తిడి చేస్తేకానీ చంద్రబాబు బహిరంగసభలో పాల్గొనేందుకు అంగీకరించలేదు. కేసీయార్ అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారు. అలాంటిది కేసీయార్ పై ఆరోపణలు, విమర్శలు కూడా చేస్తారా ?





ఖమ్మం బహిరంగసభ ద్వారా వెల్లడించాలని అనుకున్నది టీడీపీ సత్తా కాదు అచ్చంగా కమ్మోరి కెపాసిటీని మాత్రమే. ఇందులో సామాజికవర్గం సక్సెస్ అయినట్లే అనుకోవాలి. కాకపోతే ఇదే సమయంలో చంద్రబాబులోని పిరికితనం కూడా బయటపడింది. రాజకీయమన్నాక ప్రత్యర్ధులపై విరుచుకుపడాల్సిందే. అందులోను ఎన్నికల ముందుకూడా ప్రత్యర్ధుల గురించి మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడుతారు ? ఈ విషయాన్నే కొందరు తమ్ముళ్ళు డైరెక్టుగా ప్రస్తావిస్తున్నారు. ఓటుకునోటు దెబ్బకు హైదరాబాద్ వదిలి వెళ్ళద్దని అప్పట్లోనే చాలామంది చంద్రబాబుకు చెప్పినా భయపడి పారిపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అప్పట్లో అరెస్టుకు భయపడకుండా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండుంటే ఇపుడు పార్టీ పరిస్ధితి ఇంత అన్యాయంగా ఉండేదికాదని తమ్ముళ్ళు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: