చైనాలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 50 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం కొన్ని యూరోపియన్ దేశాల్లో వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే, చైనాలో మాత్రం ఊహించ‌ని ట్విస్ట్ ఒక‌టి చోటు చేసుకుంది. కరోనా ప్రభావం పెరిగిపోతుంద‌నే ఉద్దేశంతో చైనా ప్ర‌భుత్వం ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు వివిధ హెచ్చ‌రిక‌లు చేసింది. అనేక కంపెనీల‌ను మూసి వేసింది. చైనాలోని చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎంద‌రో కార్మికుల‌కు ఆర్థిక క‌ష్టాలు ఎదుర‌య్యాయి. అయితే, ఆస‌క్తిక‌రంగా...ఇది ఆ దేశానికి మేలు చేసింది. 

 


చైనాలో చాలా వరకు పరిశ్రమలు మూత పడటంతో ఆ దేశంలో కాలుష్యం తీవ్రత  తగ్గినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  చైనాలో ముఖ్యంగా  హుబెయ్‌ ప్రావిన్స్‌లో వాయు కాలుష్యం బాగా తగ్గింది. గత ఏడాది ఫిబ్రవరి(10-25  తేదీల మధ్య) నాటికి.. ఈ ఏడాది అదే సమయానికి గాలిలో నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ స్థాయిలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు తీసిన శాటిలైట్‌ చిత్రాల్లో   తేడా స్పష్టంగా కనిపిస్తోంది.  వాహనాలు, పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కరోనా ప్రభావంతో చైనాలోని చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోవడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా రవాణాపై ఆంక్షలు విధించడంతో కాలుష్యంగా గణనీయంగా తగ్గిందని శాస్త్రవేత్త‌లు ప్ర‌క‌టించారు.

 

కాగా, క‌రోనా.. మహమ్మారిగా ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే వీలుందని, మాంద్యానికి అవకాశాలున్నాయని గ్లోబల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ హెచ్చరించింది. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌.. క్రమక్రమంగా ఇతర దేశాలకూ పాకుతుండటం ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న త‌రుణంలో ఈ హెచ్చ‌రిక చేసింది. మనుషుల ప్రాణాలను మింగేస్తున్న ఈ వైరస్‌.. ఆర్థిక వ్యవస్థలనూ బలిగొంటుండటంతో దీన్ని అంతమొందించకపోతే అనర్థాలు తప్పవని మూడీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ‘చైనా ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఇప్పటికే దెబ్బ తీసింది. ఇప్పుడిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తున్నది’ అని మూడీస్‌ అనలిటిక్స్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ మార్క్‌ జండి అన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనేక మార్గాల్లో కోవిడ్‌-19 దాడి చేస్తున్నది. చైనాకు ప్రయాణాలు తగ్గి పర్యాటక రంగం దెబ్బతిన్నది. విమానాల రాకపోకలు మందగించాయి. జల రవాణా కూడా స్తంభించిపోయింది. దీనివల్ల అమెరికా వంటి ఇతర దేశాలూ ప్రభావితమవుతున్నాయి. ఏటా చైనాకు చెందిన దాదాపు 30 లక్షల పర్యాటకులు అమెరికాకు వెళ్తున్నారు. ఇప్పుడిది ఆగిపోయినైట్లెంది’ అని జండి తెలిపారు.

మ‌రోవైపు ఇటలీలోని మిలాన్‌, ఇటలీల్లోనూ కరోనా వ్యాపిస్తుండటంతో మొత్తం ఐరోపా సమాజంపైనే ప్రభావం పడుతున్నదని మూడీస్‌ చెప్పింది. ఐరోపా దేశాల్లో ప్రధాన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న ఇటలీలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆదాయం పడిపోయి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి మొత్తం వ్యవస్థలే నీరుగారిపోయే ప్రమాదం ఉందని మూడీస్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: