రెండవ దశలో
కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కొవిడ్ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా గుంపులు గుంపులుగా సమావేశమై పూర్తి నిర్లక్ష్యం చూపడం వలనే కరోనాలో కొత్త జాతి వైరసులు విజృంభించాయని.. సరికొత్త మ్యూటెంట్స్ వల్ల పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. కరోనా తీవ్రత కూడా అధికమై అనేక మంది రోగులు చనిపోతున్నారని వైద్యులు ఘంటా పథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వైరాలజిస్ట్ జాకబ్ జాన్.. బయోఎథిక్స్, పాలసీ నిపుణులు ఆనంద్.. సాంక్రమిక వ్యాధినిపుణులు డేవిడ్ హేమన్ మాట్లాడుతూ.. సెకండ్ వేవ్ లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్నప్పటికీ.. దాని వ్యవధి చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో ఏప్రిల్ నెలాఖరికి కరోనా కేసులు పీక్ స్టేజ్ కి చేరుకుంటాయని..
జూన్ నెలలోపు కేసులు గణనీయంగా తగ్గి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఈ ముగ్గురు నిపుణులు అంచనా వేశారు.
భారత్ లో కరోనా వ్యాప్తి మళ్ళీ విజృంభించిన సమయంలో వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయకుండా ప్రభుత్వం పొరపాటు చేసిందని.. సెకండ్ వేవ్ లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు నుంచి 5 శాతం శాంపిళ్లను తీసుకొని పరీక్షలు చేసి వాటిని ఎదుర్కొనేందుకు నూతన విధానాలను త్వరితగతిన అవలంభించినట్లయితే బాగుండేదని వీళ్ళు అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య రంగాలు కలసి పని చేస్తూ భారీ ఎత్తున సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం వ్యాక్సిన్ ని బూస్టర్ డోస్ గా ప్రజలకు ఇచ్చినట్లయితే సరికొత్త వేరియంట్లు విజృంభించక పోయేవని చెప్పుకొచ్చారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాణాంతక మహమ్మారిని అడ్డుకోగలమని.. వైరస్ తో బతకడం కూడా నేర్చుకోవాలని డేవిడ్ హేమన్ తెలిపారు. ఇదిలా ఉండగా.. భారత దేశంలో ప్రతి ఒక్కరికీ సాధ్యమైనంత త్వరగా కరోనా టీకాలు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.