హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలో ప్రచారం జోరు పెంచాయి. కేసీఆర్ వర్సెస్ ఈటలగా సాగుతున్న ఈ ఉప సమరంపై తెలంగాణ అంతటా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకూ ఈ నియోజక వర్గంలో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించలేదు. మంత్రి హరీశ్ రావు.. హుజూరాబాద్ ఉపఎన్నిక బాధ్యతను నెత్తిన వేసుకుని అనేక మంది మంత్రులను అక్కడ మోహరించి ఎలాగైనా పార్టీని గెలిపించాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.


చూడప్పా.. సిద్దప్పా.. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అన్నట్టు సరిగ్గా ఎన్నికల పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు సీఎం కేసీఆర్ ప్రచారం ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనుకోని షాక్ ఇచ్చింది. కరోనా కారణంగా బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో సీఎం సభ విషయం డైలమాలో పడిపోయింది. అయితే ఎలాగైనా సీఎ కేసీఆర్ రెండు రోజులు హుజూరాబాద్‌లో ప్రచారం నిర్వహించేలా పార్టీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.


ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభ కాకుండా ఇతర మార్గాలను ప్లాన్ చేస్తున్నాయి. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదనే సీఈసీ నిబంధనలు విధించింది. దీంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్ఠానం రూట్ మార్చేసింది. వాస్తవానికి ముందుగా హుజూరాబాద్‌కు పొరుగున గల హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌ పేటలో కేసీఆర్‌ బహిరంగ సభ పెట్టాలనుకున్నారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసి.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించేందు ప్లాన్ రెడీ చేస్తున్నారు.


సీఎం కేసీఆర్ రోడ్‌ షోలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. హుజూరాబాద్‌లో ఈ నెల 30న పోలింగ్‌ జరగాల్సి ఉంది. అంటే 28నే ప్రచారానికి ఆఖరి రోజు.. అందుకే సీఎం కేసీఆర్‌ 26 లేదా 27న సభ నిర్వహించాలని ముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీఈసీ నిబంధనల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల సీఎం కేసీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: