కీల‌క‌మైన ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో రాజ‌కీయ మంట‌ల జోరు కొన‌సాగుతోంది. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న ఉమ్మ‌డి కూట‌మిలో టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు బ‌ల‌మైన నాయ‌కుడు. ఇక‌, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ, టీడీపీ మాజీ నాయ‌కుడు తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. ఈయ‌న కూడా అంతే బ‌ల‌వంతుడైన నాయ‌కుడు. దీంతో ఇక్క‌డ ఫైట్ మామూలుగా లేద‌నే టాక్ వినిపిస్తోంది.

వాస్త‌వానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. వైసీపీకి ఈ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేకపోవడంతో గత రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని 2014లో గిరిజాల వెంకటస్వామి నాయుడును బరిలో దించినా ఉపయోగం లేకపోయింది. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

కాపుల‌కు పెద్ద పీట‌
వైసీపీ వ్యూహాత్మ‌కంగా మండ‌పేట‌పై దృష్టి పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్నఫైర్ బ్రాండ్ నాయ‌కుడు తోట త్రిమూర్తులకు ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. అయితే.. ఈయ‌న నాన్ లోక‌ల్ అనేది టీడీపీ వాద‌న‌. వాస్త‌వానికి తోట సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. అప్పట్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ఉండటంతో తోట త్రిమూర్తులను మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. అప్పటినుంచి తోట త్రిమూర్తులు మండపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.  

వ‌రుస విజ‌యాల‌తో సైకిల్ ప‌రుగులు!
మండపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వ‌రుస విజ‌యాల‌తో సైకిల్ ప‌రుగులు పెడుతూ నే ఉంది. వేగుళ్ల జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు. ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తారనే పేరుంది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జోగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు. స్థానికంగా అందుబాటులో ఉంటారనే పేరుతో పాటు.. ప్రజల మనిషిగా నియోజకవర్గ ప్రజలు ఆయనను గుర్తిస్తారు. దీంతో పార్టీ అధిష్టానం నాలుగో సారి ఆయనకు టికెట్ కేటాయించింది.

ఈ నియోజకవర్గంలో కాపు, బీసీ శెట్టిబలిజ, దళిత సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం జనసేన మద్దతు టీడీపీకి ఉండటంతో వేగుళ్ల నాలుగో సారి గెలుస్తారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి పొత్తులో భాగంగా ఈసీటును జనసేన ఆశించింది. అయితే టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ సీటును జనసేన వదులుకోవల్సి వచ్చింది.  ఇప్పుడు అంద‌రూ క‌లిసి వేగుళ్ల‌ను గెలిపించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: