
- గతంలో సీఎంవో అధికారులంటే సీఎం ఆదేశాలను అమలు చేయడం వరకే పరిమితమైన అధికారులు
- ప్రస్తుతం సీఎం మనస్సు హత్తుకునేలా.. ప్రజల్లో చంద్రబాబు ఇమేజ్ పెంచేందుకు కృషి చేస్తున్న సీఎంఓ అధికారులు
- సీఎంఓ పనితీరుపై పలువురు నేతలు ప్రశంశలు
- మరింత సమర్థవంతంగా పని చేసి ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచన
సీఎంఓ అంటే.. సీఎం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడమే విధిగా అధికారులు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని అమలు చేయడమే కాకుండా.. సీఎం ను సామాన్యులకు దగ్గర చేయడం, ప్రభుత్వం పై ప్రజల్లో ఇమేజ్ పెంచేందుకు సీఎంఓ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఫలితంగా గతంలో సీఎం వస్తే పరదాల మాటున తిరిగే పరిస్థితి నుంచి సామాన్యులు సైతం నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కల్పించారు. అలాగే సీఎం దృష్టికీ వచ్చిన సమస్యలను కూడా యుద్ధప్రాతిపదికన పరిష్కరించి ఇది ప్రజల ప్రభుత్వం అని ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసేలా పని చేస్తున్నారు. సీఎంఓ పనితీరు పై ఇటు అధికారపార్టీ నేతలు.. అటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఉత్సాహంతో పని చేసి సీఎం కు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచిస్తున్న వైనం పై ప్రత్యేక కథనం...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగవ సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. గతంలో మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించినా.. ఈ దఫా మాత్రం వినూత్న రీతిలో ప్రజలకు పాలన అందిస్తూ సామాన్యులకు దగ్గరవుతున్నారు. ప్రధానంగా ప్రతి నెల ప్రజల ఇళ్లకు వెళ్లి అందించే ఎన్టీఆర్ భరోసా ఫించన్ నుంచి రేపు జరగబోయే యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం వరకు ప్రజలకు చేరువయ్యే రీతిలోనే నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎంఓ లో అధికారులతో పాటు కొంత మంది పార్టీ పెద్దల సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రధానంగా సీఎంను ప్రజలకు ఏ విధంగా చేరువయ్యేలా చేయాలో అందుకు తగ్గ పెద్ద కసరత్తే చేస్తున్నారు. పార్టీలోని కొంత మంది సీనియర్ నాయకులతో పాటు అధిష్టానికి దగ్గర ఉండే నాయకుల ఆలోచనలను పంచుకుంటున్నారు. గత ముఖ్యమంత్రి ఇంటిపట్టునే ఉంటూ బటన్ లు నొక్కుతూ కాలక్షేపం చేశారు. అలాగే ప్రజల్లోకి వెళితే.. పరదాలు, బారికేడ్లు కట్టుకొని వెళ్లేవారు. ప్రజలకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అందుకు భిన్నంగా అత్యంత సామాన్యుల చెంతకు సీఎం చేరువవుతున్నారు. తద్వారా ఎంతో మంది అభాగ్యులకు నేరుగా న్యాయం జరిగే విధంగా చూస్తున్నారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి అందించడమే కాదు. స్వయానా సీఎం అయ్యి ఉండి వాళ్ల ఇంట్లో టీ పెట్టి వాళ్లకే అందించి లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం పొందేలా చేస్తున్నారు. ఫించన్ పంపిణీ రోజున గ్రామ సభ నిర్వహించి కేవలం ఆ గ్రామ ప్రజలతో ముచ్చటించి వాళ్ల సమస్యలను తీర్చడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తూ వస్తున్నారు. ఒక సీఎం గ్రామ సభ నిర్వహిస్తున్నారంటే ఆ దరిదాపుల్లోని గ్రామ ప్రజలందరిని తండోపతండాలుగా రావడం గతంలో చూశాం. అయితే అందుకు భిన్నంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో సీఎంకు కట్టినట్లుగా ఈ సీఎంకు పరదాలు లేవు, బార్ కేడ్లు లేవు, చెట్లు నరకటం లేదు. ట్రాఫిక్ జామ్ అంతకంటే లేదు. బహుశా ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ ఒక్క సీఎం నిర్వహించి ఉండకపోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, 20 ఏళ్ల పాటు సీఎం, 70 ఏళ్ల వయస్సులో అలా లబ్ధిదారులకు టీ అందించడం నభూతో న భవిష్యత్ లా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే చర్చనీయాంశమైంది. అలాగే అంబేద్కర్ జయంతి రోజున ఆయనకు పూలదండ వేసి గుర్తుచేసుకోవడం ఆనవాయితే. ఈ సారి దానితో పాటు అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి కింద లబ్ధిపొంది విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న లబ్ధిదారులతో నేరుగా అదే రోజున ప్రజలందరి ముందు ముచ్చటించారు.
ఆ కార్యక్రమం తరువాత దళితులు, అందులోనూ ముఖ్యంగా దళిత విద్యార్ధులకు సీఎం చంద్రబాబుపై అభిమానం రెట్టింపు అయ్యిందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను సీఎం చంద్రబాబు సందర్శించి విద్యార్థినీలతో ముచ్చటించారు. 9వ తరగతి విద్యార్థినులను వెంటబెట్టుకుని వసతి గృహంలోకి వెళ్లి అన్ని గదులు, మరుగుదొడ్లను కూడా పరిశీలించారు. ఇంకేం సౌకర్యాలు కావాలని సీఎం చంద్రబాబు బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఇంత వరకు ఏ ఒక్క సీఎం నేరుగా ఇలా వచ్చి బాలికలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం ఇదే తొలిసారి అని హాస్టల్ సిబ్బంది తెలిపారు. అంతేకాదు ప్రతి నెల మూడో శనివారం జరగుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో సీఎంను వినూత్న రీతిలో పరిచయం చేస్తున్నారు. ఒక సారి మున్సిపల్ కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తే.. మరొక సారి భవన నిర్మాణ కార్మికులతో ఇంకో సారి.. ఉపాధి కూలీలతో కలిసి ముచ్చటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
సీఎం అంటే ఇలా ప్రజలతోనే గడపాలనే సీఎంవో అధికారుల ఆలోచనలకు చంద్రబాబు సైతం ముగ్దుడైపోతున్నారు. గతంలో సీఎంవోలోని అధికారులు అంటే సీఎం ఆదేశాలను అమలు చేయడం వరకే పరిమితం అయ్యే వారని.. కాని ఈ సారి మాత్రం సీఎం మనస్సు హత్తుకునేలా ప్రజల్లో చంద్రబాబు ఇమేజ్ పెంచేలా సీఎంఓ అధికారులు అనుక్షణం శ్రమిస్తున్నారు. అలాగే సీఎంవో అధికారులకు పార్టీలోని కొంత మంది పెద్దల సహకారంతో తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల కృషి పై ఇటు టీడీపీ నేతలు.. అటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్పూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని, సీఎం కు, పార్టీకి, మంచి పేరు తెచ్చేలా.. సామాన్యులకు మరింత మంచి జరిగేలా చూడాలని సూచిస్తున్నారు. అంతకు మించి చేస్తారని భావిస్తున్నారు. మరి ఎంత వరకు చేస్తారు అనేది తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే..!!!
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు