
ఇన్నాళ్లూ అక్రమ వలసదారులకు ఈ రెండు రాష్ట్రాలు ఓ ఆటస్థలంగా మారాయి. అస్సాంలో అధికారులు ఉక్కుపాదం మోపితే, పక్కనే ఉన్న మిజోరాంలోకి జారుకోవడం. అక్కడ నిఘా పెరిగితే తిరిగి అస్సాంలోకి చొరబడటం. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన ఈ చొరబాటుదారులు ఆడుతున్న ఈ దాగుడుమూతల ఆటకు ఇప్పుడు తెరపడనుంది.
ఈ స్కెచ్ వెనుక ఉన్నది ఎవరో కాదు, అస్సాం ఫైర్‌బ్రాండ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఆయన వేసిన పక్కా ప్లాన్‌కు మిజోరాం ప్రభుత్వం కూడా సై అంది. ఈ వ్యూహంలో భాగంగా, రెండు రాష్ట్రాలు తమ భూభాగంలోకి అనధికారికంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశ్, మయన్మార్ జాతీయులను అరికట్టడానికి గుర్తింపు పత్రాల విషయంలో తమ వైఖరిని కఠినతరం చేశాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ప్రణాళిక వివరాలను స్వయంగా వెల్లడించారు. జూన్ 27న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆధార్ జారీ నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరంపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్ జాతీయులు ఆధార్ కార్డులు పొందకుండా నిరోధించడానికి, ఇకపై కేవలం జిల్లా కమీషనర్ల (డీసీల) ద్వారా మాత్రమే కొత్తగా వయోజనులకు ఆధార్ కార్డులు జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం శర్మ మాట్లాడుతూ, "సాధారణంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అస్సాం వచ్చేవారంతా వయోజనులే. మా రాష్ట్రంలో ఇప్పటికే 100% ఆధార్ కవరేజీ సాధించినందున, కొత్తగా వయోజనులు చేసుకునే దరఖాస్తులను క్షుణ్ణంగా విచారిస్తాం.
ఆధార్ జారీ అధికారాన్ని కేవలం డీసీలకు మాత్రమే అప్పగిస్తే, బంగ్లాదేశీయులు ఆధార్ పొందడం కష్టమవుతుంది. ఈ పత్రం వారి వద్ద లేకపోతే, వారిని గుర్తించడం, వెనక్కి పంపడం సులభం అవుతుంది" అని గౌహతిలో విలేకరులకు తెలిపారు. ఇటీవలే 20 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను వెనక్కి పంపినట్లు ఆయన ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు, మిజోరాం ప్రభుత్వం కూడా సరిహద్దుల వెంబడి కదలికలను నియంత్రించడానికి మయన్మార్ జాతీయుల గుర్తింపు కార్డులను తమ వద్దే ఉంచుకోవాలని యోచిస్తోంది. దీనివల్ల వారి కదలికలను సులభంగా పర్యవేక్షించవచ్చు.
ఒక చోట నో ఎంట్రీ అంటే.. రెండో చోటా గేట్లు బంద్
ఇకపై ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక బలమైన అవగాహన ఉంటుంది. అస్సాం తరిమికొట్టిన ఏ ఒక్క వలసదారుడికి మిజోరాంలో ఆశ్రయం ఉండదు. మిజోరాం గెంటేసిన వారికి అస్సాంలో అడుగుపెట్టే సీన్ లేదు. ఇప్పటికే జాతీయ పౌర రిజిస్టర్ (NRC)లో చేరడానికి దరఖాస్తు చేసుకోని వారికి ఆధార్ నంబర్ పొందకుండా నిషేధం విధించినట్లు ఏప్రిల్‌లోనే సీఎం శర్మ ప్రకటించారు.
ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో చొరబాటుదారుల ఆటలు అస్సలు సాగవు. ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆపరేషన్‌తో వారి కథకు శుభం కార్డు పడినట్లే. ఈ నిర్ణయం దేశ అంతర్గత భద్రత విషయంలో ఒక కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.