తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హీట్ మోడ్‌లోనే సాగుతుంటాయి. కొత్త పార్టీలు పుట్టడం, పాత పార్టీలు విలీనం కావడం ఈ రాష్ట్రంలో సాధారణం. రాష్ట్ర విభజన తర్వాత అనేక పార్టీలు వెలుగులోకి వచ్చినా, ప్రజాదరణ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చుట్టూ మాత్రమే తిరుగుతూ వస్తోంది. ఉద్యమ నాయకులు కూడా పార్టీలు పెట్టినా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ కొత్త రాజకీయ శక్తులు ముందుకు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో జనంలోకి వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడటం తన పార్టీ ప్రధాన లక్ష్యమని మల్లన్న స్పష్టం చేశారు.
 

ఇకపై జరిగే ఎన్నికల్లో ఎక్కడైనా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన ప్రకటించారు. బీసీలు ఈ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. మల్లన్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ స్థాపనపై ఆలోచిస్తున్నట్లు టాక్ ఉంది. అధికారిక ప్రకటన చేయకపోయినా, ప్రస్తుతం తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లో చురుకుగా కదులుతున్నారు. కేసీఆర్ కుటుంబ అభిమానులను, బీఆర్ఎస్ లో అసంతృప్తులను తనవైపు తిప్పుకోవాలని కవిత ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీకి వ్యతిరేకంగా నిజంగా కవిత కొత్త పార్టీ పెడతారా ? అనే ప్రశ్న ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే విషయం గమనార్హం.

 

ఇక రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మల్లన్న తన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున, కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరి వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకరు కాంగ్రెస్ నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి కొత్త దారులు ఎంచుకోవడం, రెండు ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్‌ను ఎటు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ ఇద్దరి భవిష్యత్ రాజకీయ సత్తాకు టెస్ట్‌గా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: