
ఆ తర్వాత పిఠాపురంలో చోటుచేసుకున్న పరిణామాలు గీతకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చాయి. ముఖ్యంగా వైసీపీ బలహీనపడుతున్న నేపథ్యంలో పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గిపోతుందన్న వాదనలు చెలరేగాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీంతో, గీత అంతర్గతంగా రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు గీత ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక మరోవైపు, పిఠాపురం రాజకీయాల్లో కీలక వ్యక్తి అయిన పెండం దొరబాబు వైసీపీని వీడి జనసేనలో చేరడం వంగా గీతకు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన వెనుక అనేక మంది కార్యకర్తలు, స్థానిక నాయకులు కూడా జనసేనలో చేరిపోవడంతో గీతకు ఇక్కడి బలమైన నెట్‌వర్క్ కోల్పోయినట్లైంది. పిఠాపురంలో ఆమెకు అండగా నిలిచే నాయకులు ఇప్పుడు చాలా తక్కువగానే కనిపిస్తున్నారు. గీత తన పాత ఇల్లు పిఠాపురంలో ఖాళీ చేసి కాకినాడలో నివాసం ఉంటుండటంతో, నియోజకవర్గంలో ఆమె ఉనికి తగ్గిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే పర్యటించారని స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సమస్యలపై స్పందించకపోవడం, ప్రాంతీయ కార్యకర్తలకు దూరంగా ఉండటం కూడా గీత రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపింది. గీత వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాకుండా కేవలం మద్దతుగా మాత్రమే ఉండి, రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.