ఏపీలో సీఎం జగన్‌ను బోస్డీకే అంటూ పరుష పదజాలం వాడిన పట్టాభి వ్యవహారం ఆ రాష్ట్రంలో రాజకీయ సునామీనే సృష్టిస్తోంది. పట్టాభి కామెంట్లతో బీపీ తెచ్చుకున్న వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారాయి. చంద్రబాబు సీన్‌లోకి దిగి అమిత్ షా కు ఫోన్ చేయడం.. గవర్నర్‌కు ఫోన్‌ చేయడం.. డీజీపీకి ఫోన్‌ చేసినా స్పందంచలేదని విమర్శించడంతో కథ పాకాన పడింది. ఏపీలో వైసీపీ అరాచకంగా ప్రవర్తిస్తోందని సాధారణ జనం కూడా భావించే పరిస్థితి వచ్చింది.


ఆ తర్వాత చంద్రబాబు పార్టీ కార్యాలయాన్ని, పట్టాభి ఇంటిని సందర్శించారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా 36 గంటల దీక్షకు కూర్చున్నారు. పార్టీ కార్యాలయంలో విరిగిన శకలాల మధ్యే దీక్షకు కూర్చుంటున్నారు. ఈ సీన్ అంతా బాగానే ఉంది. వైసీపీ తీరును చంద్రబాబు అండ్ టీడీపీ ఎండగట్టడం బాగానే ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను గట్టిగా ప్రతిఘటించాల్సిందే.


అదే సమయంలో తమ నాయకుడు పట్టాభి వాడిన భాష గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. నీతి వంతమైన అర్థవంతమైన రాజకీయాలు చేస్తాననే చంద్రబాబు.. తన పార్టీకి చెందిన ఓ నాయకుడు సీఎంను పట్టుకుని బోస్‌డీకే.. రారా.. పోరా.. నా కొడకా.. వంటి పదజాలంతో పదే పదే తిడితే.. దాన్ని ప్రస్తావించకపోవడం ఏమాత్రం సమర్థనీయం కాదంటున్నారు విశ్లేషకులు.


మా నాయకుడు ఓ మాట పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చు. దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా అంటూ చంద్రబాబు నిలదీస్తే.. అర్థవంతంగా ఉండేది. కానీ.. తమ నాయకుడి బూతులు కప్పిపెట్టి అధికారపక్షందే మొత్తం తప్పనేలా చంద్రబాబు సీన్ క్రియేట్ చేస్తే పట్టాభి బూతులు జనంలోకి వెళ్లకుండా ఉంటాయా.. ఇదేందయ్యా చంద్రబాబు..నువ్వు ఆ ఒక్క మాట అని ఉంటే.. జగన్ చెంప చెళ్లుమనిపించినట్టు హుందాగా ఉండేది కదా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: