భారత క్రికెటర్ మనీశ్ పాండే కొట్టిన ఓ సిక్సర్ ట్విట్టర్‌ లో బాగా వైరల్‌ గా మారింది. ఆదివారం నాడు తమిళనాడుతో  జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ - 20 ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కర్ణాటక కెప్టెన్ హోదాలో మనీశ్ జట్టును ముందుండి ఆడించాడు. 39 పరుగులకు రెండు వికెట్లు పడిపోయిన సందర్భంలో క్రీజులోకి వచ్చిన తను అజేయ అర్ధసెంచరీ (45 బంతుల్లో 60 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) లతో ఒక కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో ప్రత్యర్థికి పోటీ ఇవ్వగలిగే రీతిలో 180/5 ను కర్ణాటక స్కోర్ సాధించింది. అనంతరం ఛేజింగ్‌ లో ఓవర్లన్నీ ఆడిన తమిళనాడు టీమ్ 179/6 కు పరిమితమై ఒక్క రన్ తేడాతో పరాజయం పాలైంది. గత సంవత్సరం టోర్నీ నెగ్గిన కర్ణాటక డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి ఈసారి కూడా విజేతగా నిలవడం జరిగింది.

 

అయితే ఈ మ్యాచ్‌ లో మనీశ్ పాండే కొట్టిన సిక్సర్ ట్రోఫీకే హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ లో తమిళనాడు బౌలర్ మురుగన్ అశ్విన్ బౌలింగ్‌ లో అతని తల మీదుగానే కొట్టిన షాట్ ఏకంగా స్టేడియం అవతల పడింది. అప్పుడే బౌలింగ్‌ కు వచ్చిన మురుగన్‌ ను ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో ముందుకు వచ్చి ఆడిన లాఫ్టెడ్ షాట్‌ తో కన్నడ టీమ్‌ కు ఆరు పరుగులు సమకూరాయి. మరోవైపు మైదానం ఆవతల బంతి పడడంతో మరో కొత్త బంతిని తెప్పించి ఇన్నింగ్స్‌ ను ఆడించారు.

 

మరోవైపు మనీశ్ పాండే సోమవారం ఒక ఇంటివాడు అవుతున్నాడు. కన్నడ నటి ఆశ్రితా శెట్టిని నేడు (సోమవారం) వివాహం చేసుకోబోతున్నాడు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిశాక తన పెళ్లి గురించి మాట్లాడుతూ తను సోమవారం పెళ్లి చేసుకుంటున్నానని, జీవితం ఆనందంగా సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. హీరో సిద్ధార్థ్‌ తో అశ్రిత నటించిన ఎన్‌హెచ్ - 4 అనే సినిమా తెలుగులోకి కూడా డబ్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: