జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న కారణంగా దక్షిణ భారత రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోబోతున్నాయా.. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు తగ్గించే అవకాశం ఉందా.. అంటే అవునంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పు ద్వారా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్  హెచ్చరించారు.


దేశ జనాభాలో ఈ రాష్ట్రాల వాటా 1951లో 26.2 శాతంగా ఉండేది. అయితే  2022 నాటికి ఇది 19.8 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో ఉత్తరాదిలో జనాభా శాతం 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది. అంటే దక్షిణాదిలో 6.4 శాతం జనాభా తగ్గపోగా..  ఉత్తరాదిలో మాత్రం 4.1 శాతం జనాభా పెరిగిందన్నమాట. మరో నాలుగేళ్లలో అంటే..  2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ  నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా జరుగుతుంది.


గతంలో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన కూడా జనాభా ఆధారంగానే జరుగుతుంది. దీన్ని బట్టి నియోజకవర్గాల పునర్విభజనప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్‌ సీట్ల సంఖ్యను బాగా తగ్గించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే  న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుందంటున్నారు మంత్రి  కేటీఆర్‌.  దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిందని తాజాగా వెలువడుతున్న గణాంకాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ దక్షిణాదికి జరగబోయే అన్యాయంపై స్పందించారు.


కేటీఆర్ ఆవేదనలో న్యాయం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాదితో పోలిస్తే.. చాలా క్రమశిక్షణగా ఉంటాయి. జనాభా నియంత్రణలోనూ, విద్యావకాశాల్లోనూ దక్షిణాది ముందుంది. ఆ కారణంగానే ఇక్కడ జనాభా తగ్గింది. ఇప్పుడు అదే పరిణామం ఎంపీ సీట్ల తగ్గుదలకు కారణం అయితే.. అది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: