కేసీఆర్‌ సర్కారును ఇరుకున పెడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కో అంశాన్ని హైలెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల దిల్లీ మద్యం స్కామ్‌ అంశాన్ని కేసీఆర్ కుటుంబంతో లింకు చేస్తూ ప్రచారం సాగించారు. ఇక ఇప్పుడు కాళేశ్వరం అంశాన్ని కూడా హైలెట్ చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ బృందానికి అనుమతివ్వండి అంటూ తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  బండి సంజయ్‌ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనకు బీజేపీ ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌..మొత్తం  30 మంది ముఖ్యమైన నాయకులు వస్తారని బండి సంజయ్  లేఖలో తెలిపారు.


కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్  మొదటి వారంలో బీజేపీ  బృందం సందర్శిస్తుందని  బండి  సంజయ్ చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామన్న బండి సంజయ్‌... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మాకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని లేఖలో తెలిపారు. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు ఏర్పడిన నష్ణాన్నిపరిశీలించడమే బీజేపీ  బృందం పర్యటన  లక్ష్యమన్నారు.


1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శంచాయని గుర్తు చేస్తున్న బండి సంజయ్‌... 2004 - 2009లో జరిగిన జలయజ్ఞం పనులపై  వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని కూడా గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు కూడా  ప్రభుత్వం వైపు నుండి కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


మరి బండి సంజయ్ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ కాళేశ్వరం పర్యటనకు బీజేపీ బృందాన్ని అనుమతిస్తే.. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. మరి కేసీఆర్ సర్కారు అలాంటి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: