తెలంగాణలో రేవంత్ రెడ్డి పాత సర్కారు అక్రమాలపై దృష్టి సారించడంతో ఒక్కో దారుణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం అవినీతి, ధరణి అక్రమాలు అనేకం వెలుగు చూశాయి. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం సరేసరి. తాజాగా ఇప్పుడు విజిలెన్స్ విచారణల్లో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా...గ్లోబల్ టెండర్లతో తెలంగాణ సచివాలయంలో ఐటీ పనులు చేపట్టారట. సాధారణంగా భారీ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలి.



కానీ 270 కోట్లతో సచివాలయంలో చేపట్టిన ఐటీ పనులను కొటేషన్లకే పరిమితం చేశారు.  2020 జులైలో పాత సచివాలయాన్ని కూల్చి...2021 జనవరిలో కొత్త భవనం పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 1న కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అయితే.. పాత సచివాలయాన్ని కూల్చేసిన తర్వాత దాదాపు మూడేళ్ల సమయం దొరికినా.. కొత్త సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్‌ తప్పనిసరైనా...ఆ విషయాన్ని ఐటీశాఖ గుర్తించలేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు.


కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతోపాటు సెక్రెటరియేట్ క్యాంపస్ ఏరియా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీ శాఖకు ఇచ్చారు. దీనికి  180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వచ్చాయి. అలాంటిది దాదాపు రెట్టింపు వ్యయంతో సచివాయల ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్‌ పనులు పూర్తి చేశారు. కంప్యూటర్ల కొనుగోళ్లకు మార్కెట్ ధర కంటే అధికంగా వెచ్చించారు. దీనిపై ఇప్పుడు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.  


సాధారణంగా ఇలాంటి పనులు చేసే తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ కు మాత్రం ఈ పనులు అప్పగించలేదు. దీనికి గల కారణాలపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. మరి ఎందుకు ఇలా జరిగింది.  తెలంగాణ సచివాలయంలో తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ సేవలు ఎందుకు వాడలేదనే అంశంపై విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr