వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రయాణికులతో వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు (42) మృత్యువాత పడడం కలకలం రేపింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ప్రయాణికుడు కుప్పకూలి మరణించాడని, ఆయనది సహజ మరణమేనని ఎయిరిండియా సంస్థ తెలిపింది. విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా నైజీరియాలోని లాగోస్ లో శనివారం రాత్రి 7 గంటలకు ఎయిరిండియాకు చెందిన ఏఐ 1906 విమానం బయల్దేరింది. ఉదయం 3.45 గంటలకు ముంబయి చేరుకుంది.అయితే, విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విమానంలో ఉన్న వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఎయిరిండియా పేర్కొంది.

 

 ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రయాణికులంతా దిగిపోయిన అనంతరం విమానాన్ని పూర్తిగా శానిటైజ్ చేసినట్లు ఎయిరిండియా ప్రతినిధులు వెల్లడించారు. అయితే, ప్రయాణ సమయంలో అతడికి జ్వరం ఉందని, కొద్దిసేపు విమానంలో ఊపిరి అందక ఇబ్బంది పడ్డట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో విమాన ప్రయాణానికి ముందు చేపట్టే తనిఖీలు, థర్మల్ స్క్రీనింగ్ ప్రక్రియ పట్ల ప్రశ్నలు రేకెత్తుతున్నాయి మరియు డొల్లతనం బయటపడింది. ఆ పాపమే నేడు దేశాన్ని అతాకుతలం చేస్తున్నది.

 

ఇదిలా ఉండ‌గా  వందే భారత్‌ మిషన్‌లో భాగంగా భారత్‌, అమెరికాల మధ్య మరో 10 విమానాలను అదనంగా నడపాలని ఎయిర్‌ ఇండియా నిర్ణయించింది. వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో, న్యూయార్క్‌ నగరాల నుంచి జూన్‌ 20 నుంచి జూలై 3 మధ్య ఈ విమానాలు  సేవలు అందిస్తాయి. ఈ ప‌ది ఫ్లైట్స్‌లో న్యూయార్క్‌, వాషింగ్ట‌న్‌కు నాలుగు చొప్పున‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోకు ఒక్కో విమానాన్ని ఎయిరిండియా న‌డ‌ప‌నుంది. అలాగే గ‌ల్ఫ్ దేశాల‌కు కూడా వందే భార‌త్ కార్య‌క్ర‌మాన్ని నిర్విరామంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాల నుంచి వేలాదిమందిని ఇండియాకు చేర్చిన‌ట్లు అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: