ఒకప్పట్లో సాయంత్రం అయితే పిల్లలు వీదుల్లోకి వచ్చి ఆటపాటలతో ఎంతో సంతోషంగా అంతా కలసి ఆడుకునేవారు. ఇక పాఠశాలలకు సెలవు రోజు అయితే ఎండ వాన అని తేడా లేకుండా ఒళ్ళు అలిసే వరకు ఆడుతూనే ఉండేవారు. చమటలు పట్టేలా గంతులు వేసేవారు. చదువుకు చదువు, ఆటలకు ఆటలు అన్ని ఉండేవి. పిల్లలు కూడా చాలా చురుగ్గా, చలాకీగా ఉండేవారు. పిల్లలకు ఆటపాటలు అనేవి చాలా ముఖ్యం. శారీరిక , మానసిక ఎదుగుదలకు ఆటలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చమట పట్టడం వలన శరీరంలో ఉండే మలిన పదార్దాలు చాలా వరకు బయటకు వెళతాయి.

కానీ ఇప్పట్లో చాలా మంది పిల్లలకు అసలు చమట అంటే ఏమిటో తెలీదు. ఇది నిజంగా దురదృష్టకరం. చాలా స్కూల్స్ లో కనీసం చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉండటం లేదు. మరి పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి. పిల్లలు ఆటలు ఆడడం వలన శరీరానికి సరిపడా వ్యాయామము దొరుకుతుంది. మానసిక ఉత్సాహం లభిస్తుంది. మెదడు చురుగ్గా తయారవుతుంది. నలుగురితో కలవడం వలన సోషల్ స్కిల్స్,  టీం వర్క్ యొక్క విలువ, మెళకువలు వంటివి పెరుగుతాయి. క్రీడల వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 ఇప్పట్లో చాలామంది పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇంట్లో అంతే బయటకు వెళ్లి ఆడుకోవడం వంటివి జరగడం లేదు. దీంతో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. చాలా మంది తల్లి తండ్రులైతే పిల్లలు గోల భరించలేక వారే ఫోన్ ఇచ్చి ఆడుకోండి అనిచెబుతున్నారు. దీనితో అర్ద రాత్రి వరకు ఫోన్ లతోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడో అర్ధరాత్రి పడుకుంటున్నారు.  కానీ ఇలా చేయడం వలన ఎంత ప్రమాదమో  గుర్తించలేకపోతున్నారు. అప్పటికప్పుడు పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలకి దారితీస్తాయి. అందుకే పెద్దలు పిల్లల విద్యలో ఇకనైనా జాగ్రత్తలు  తీసుకుని అన్ని విధాలుగా దృడంగా ఉండేలా చెయ్యాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: