
మనిషి తన జీవితంలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే వాటిలో డబ్బు ఒకటి. పైకి డబ్బు అంటే వ్యామోహం ఉన్నట్టు చెప్పకపోయినా తమ సంపాదనను రెట్టింపు చేసుకోవాలనే ఆలోచనలతోనే సగటు మనిషి జీవిస్తూ ఉంటాడు. డబ్బు విలువ తెలియని వాళ్లకు సైతం ప్రత్యేక పరిస్థితులు దాని విలువను తెలిసేలా చేస్తాయి. గత నాలుగున్నర నెలలుగా దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్, పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ వల్ల దేశంలోని సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదు. ఉపాధి, కార్యకలాపాలు ఆగిపోవడంతో కొందరు అప్పులపై ఆధారపడుతుంటే మరి కొందరు ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలామంది డబ్బును దాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే డబ్బు సంపాదిస్తే మాత్రమే జీవితం ఉంటుందా..? అంటే కాదనే చెప్పాలి. జీవితంలో సందర్భాన్ని బట్టి వేర్వేరు అంశాలు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఎంత సంపాదించినా అన్ని అవసరాలను డబ్బు తీర్చలేదు.
డబ్బు అనేది కొన్ని అవసరాలను తీర్చే సౌకర్యం మాత్రమే. డబ్బే పరమావధిగా కష్టపడితే ఆ డబ్బే మనల్ని మూర్ఖులుగా తయారు చేస్తుంది. డబ్బు ధ్యాసలో పడి కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతే విలువైన క్షణాలను, మధురమైన జ్ఞాపకాలను కోల్పోయినట్లేనని గుర్తుంచుకోవాలి. కొందరు సంపాదించినా పొదుపు చేస్తూ చిన్నచిన్న సంతోషాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారు.
మన దగ్గర ఉన్న డబ్బు మనకు సంతృప్తి ఇవ్వకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమే. డబ్బుతో కలకాలం తోడుగా ఉండే స్నేహితులను, ప్రశాంతతను కొనలేము. దీన్ని బట్టి డబ్బు విలువ మనకు సులభంగానే అర్థమవుతుంది. మన దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంటే ఇతరులకు సహాయం చేయాలి. ఆ డబ్బు వల్ల మనతో పాటు ఇతరుల జీవితాలు కూడా మెరుగుపడతాయి. అలా కాకుండా స్వార్థంతో ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు.