ఇటీవలి కాలంలో నిర్మాత బన్నీ వాసు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతి ఈవెంట్‌లోనూ, ప్రతి ఇంటర్వ్యూలోనూ తన స్పష్టమైన అభిప్రాయాలతో, ధైర్యంగా చెప్పే మాటలతో ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తాజాగా తన స్నేహితులతో కలిసి నిర్మించిన కొత్త చిత్రం “మిత్రమండలి” దీపావళి కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో బన్నీ వాసు చాలా చురుకుగా పాల్గొంటున్నారు.తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్లతో మాట్లాడినప్పుడు బన్నీ వాసు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ సందర్భంలో ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ — “దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు తమ సినిమాను ఆడించుకోవడానికి పక్క సినిమాలను తొక్కించే ప్రయత్నం చేస్తారు. దానిపై మీరు ఏమంటారు?” అని అడగ్గా...


దానికి బన్నీ వాసు కాస్త ఘాటుగానే, కానీ చాలా నిజాయతీగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ —“పక్క సినిమాను తొక్కితేనే మన సినిమా ఆడుతుంది అనుకునే వాళ్లు పిచ్చోళ్లు. అలాంటి ఆలోచన కలిగిన వాళ్లు ఇండస్ట్రీలో ఉండకూడదు. సినిమా బాగుంటే అది తప్పకుండా ఆడుతుంది. ప్రేక్షకుడు ఎప్పుడూ మంచి కంటెంట్‌ను మాత్రమే ఎంచుకుంటాడు. కంటెంట్ బాగుంటే ఎన్ని సినిమాలు వచ్చినా అవన్నీ ఆడుతాయి. చాలా సార్లు ఒకే రోజు విడుదలైన రెండు మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ రికార్డులు సృష్టించాయి. కాబట్టి, పక్క సినిమా రాని చూసే ప్రయత్నం చేయడం అనేది మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు.”



“ఒక సినిమా కోసం ఎంతమంది కళాకారులు, టెక్నీషియన్లు కష్టపడతారో మనందరికీ తెలుసు. వాళ్లు తమ జీవితంలో ఏకైక ఆశగా ఒక సినిమా మీద పని చేస్తారు. అలాంటి వాళ్ల కృషిని తొక్కడం అనేది మనసున్న వాళ్లు చేసే పని కాదు. నా సినిమా నాకు ఎంత ముఖ్యమో, పక్కవాళ్ల సినిమా కూడా అంతే ముఖ్యమని నేను నమ్ముతాను. అందరి సినిమాలు బాగుండాలి — అందులో నా సినిమా కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం.”బన్నీ వాసు చెప్పిన ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారినీ, సోషల్ మీడియా వర్గాలనూ ఆకట్టుకున్నాయి. ఆయన మాటల్లో కనిపించిన నిజాయతీ, సమానత భావం నెటిజన్లను బాగా ఇంప్రెస్ చేసింది. చాలా మంది ఆయనను ప్రశంసిస్తూ, “ఇండస్ట్రీకి ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న నిర్మాతలు అవసరం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరికొందరు ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ ని టార్గెట్ చేసే ఈ మాటలు మాట్లాడాడు బన్నీ వాసు అంటున్నారు. ప్రస్తుతం “మిత్రమండలి” మూవీకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, ఎమోషన్ కలగలిపిన హార్ట్ టచింగ్ కథతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందనే నమ్మకం బన్నీ వాసు వ్యక్తం చేశారు. ఇక దీపావళి రేస్‌లో నాలుగు సినిమాల మధ్య “మిత్రమండలి” కూడా తనదైన మార్క్ వేసేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: