ఇప్పటి కాలంలో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలబడడం అంటే అంత సులభం కాదు. ఒకప్పుడు నటీమణులు తమ సినిమాలు, నటన, ప్రతిభ గురించి మాత్రమే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరోయిన్స్ జీవితం బహిరంగ పుస్తకంలా మారిపోయింది. వారి ప్రతి ఫోటో, ప్రతి పోస్ట్, ప్రతి చిన్న చర్యనూ జనాలు గమనిస్తూ ఉంటారు. ఫలితంగా, వారికి కొత్త తరహా "తలనొప్పులు" మొదలయ్యాయి. ఇప్పటి హీరోయిన్ ఒక అబ్బాయితో ఫ్రెండ్‌గా ఉన్నా, కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడినా, ఆ ఒక్క ఫోటో లేదా వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యే సరికి నెటిజన్లు దానికి వంద అర్థాలు తీస్తారు. వెంటనే ఆ హీరోయిన్ ఆ అబ్బాయితో “లవ్‌లో ఉంది”, “డేటింగ్ చేస్తోంది” అంటూ వార్తలు వైరల్ అవుతాయి. ఎవరైనా నిజంగా ప్రేమలో ఉన్నారనుకోండి, వెంటనే “పెళ్లి చేసుకుందట”, “గర్భవతిగా మారిందట” అంటూ వార్తల వరద ప్రారంభమవుతుంది. ఈ ట్రెండ్ వల్ల చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా దీనిపై ఘాటుగా స్పందించింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి – “నేను 16 నెలల గర్భవతిగా ఉన్న ఇది కొత్త ప్రపంచ రికార్డ్ కదా!” అంటూ సెటైర్లు వేసింది. నెటిజన్ల ఊహాగానాలపై ఆమె చేసిన ఈ కౌంటర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పరిస్థితులు తరచుగా కనిపిస్తున్నాయి. హీరోయిన్ అంజలి కూడా ఇటీవల తనపై వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేసింది. “నాకు తెలియకుండానే నా పెళ్లి చేసేశారు, హనీమూన్ కూడా అయిపోయిందట.. అంటూ రియాక్ట్ అయ్యింది. ఇక త్రిష అయితే నా పెళ్లి నాకు తెలియకుండా చేశారు..కనీసం హనీమూన్ డేట్ అయినా చెప్పండి, నేను రెడీగా ఉంటా!” అంటూ ఆమె సరదాగా కానీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇక సమంత విషయానికి వస్తే – ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అంతమండడం లేదు. “రెండో పెళ్లి ఎప్పుడు?”, “ఎవరికీ పెళ్లి చేసుకుంటుంది?” అంటూ ప్రతీ కొన్ని రోజులకు ఒక కొత్త వార్త బయటికొస్తుంది. సమంత అయితే వాటిని పట్టించుకోకుండా తన కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇది కేవలం హీరోయిన్స్‌కే పరిమితం కాదు. స్టార్ సెలబ్రిటీస్, యాంకర్స్, మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్ – ఎవరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా, వారి జీవితంపై ఊహాగానాలు తప్పవు. కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం ఈ రూమర్స్ ఎక్కువగా వైరల్ అవుతాయి. కారణం – ప్రజలు వారిని దగ్గరగా చూసి, వ్యక్తిగతంగా తెలుసుకున్నట్లు భావించడం.

నిజం చెప్పాలంటే, సోషల్ మీడియా హీరోయిన్స్‌కు ఒక వరమో..? ఒక శాపమో..? అర్ధం కావడం లేదు. ఒకవైపు వారి అభిమానులు పెరిగేలా, వారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా చేరేలా చేసింది. మరోవైపు, వ్యక్తిగత జీవితం పట్ల గౌరవం లేకుండా వదంతులు పుట్టించే వేదికగా మారింది. ఇప్పుడు చాలా మంది స్టార్ నటీమణులు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సరైన మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న ఈ కొత్త తలనొప్పులు వారి నటనా జీవితానికి మించిన సవాళ్లుగా మారాయి. సోషల్ మీడియా రూమర్స్, వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు, నెటిజన్ల ఊహాగానాలు – ఇవన్నీ వారిని మానసికంగా ప్రభావితం చేస్తున్నాయి. కానీ అయినప్పటికీ, వారు చిరునవ్వుతో ముందుకు సాగుతూ తమ కెరీర్‌ని నిలబెట్టుకోవడమే నిజమైన విజయం అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: