ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగస్టు 7, 2025

స్ట్రీమింగ్‌ వేదిక :  సోనీ లివ్

నటీనటులు : ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్య దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శత్రు తదితరులు

దర్శకత్వం : దేవా కట్టా, కిరణ్ జేయ్ కుమార్

నిర్మాతలు : జయ్ కృష్ణ, లింగమనేని, శ్రీ హర్ష

సినిమాటోగ్రఫీ : సురేష్ రగుటు, జ్ఞానశేఖర్ వి.ఎస్

సంగీతం : శక్తికాంత్ కార్తిక్

ఎడిటర్ : ప్రవీణ్ కె.ఎల్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ... 1970ల నుంచి 2000 వరకు భారత రాజకీయాలలో కీలకంగా నిలిచిన నాయకుల కథలతో నిండిన కాలం. ఆ కాలపు రాజకీయ నాయ‌కుల జీవితాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు దేవా కట్టా రూపొందించిన వెబ్ సిరీస్ “మయసభ” ప్రేక్షకులను మరోసారి నాటి రాజకీయ కక్షలు, అనుబంధాలు, కుట్రలు, తిరుగుబాట్ల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సోనీ లివ్‌ వేదికగా విడుదలైన ఈ సిరీస్ ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:
నర్సిపల్లికి చెందిన కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) – ఒక సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ, చిన్ననాటి నుంచి రాజకీయాల్లో ఎదగాలని కలలు కంటూ పెరుగుతాడు. మరోవైపు కడపకు చెందిన ఎంఎస్ రామిరెడ్డి (చైతన్య రావు), ఎంబీబీఎస్ చదువుతుంటాడు కానీ అతని తండ్రి మాత్రం కొడుకును రాజకీయాల్లో చూడాలనే ఆకాంక్ష పెంచుకుంటాడు. ఈ ఇద్దరు యువకులు అనుకోకుండా కలసి మిత్రులవుతారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి, సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఎదుగుతారు.

విశ్లేషణ:
ఇది కల్పిత కథ అని చెప్పినా, ఇందులో చూపించిన పాత్రలు, పరిస్థితులు, నాయకుల క్యారికేచర్లు చూస్తే స్పష్టమవుతుంది – కృష్ణమ నాయుడు పాత్ర చంద్రబాబు నాయుడిని, రామిరెడ్డి పాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సూచిస్తున్నాయనేది. నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్, వంగవీటి రాధ, పరిటాల రవి, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ వంటి నేతల పాత్రలు మాయాసభలో తమదైన స్థానం సంపాదించాయి.

సిరీస్ లోని స్క్రీన్ ప్లే, కథనం చాలా బలంగా ఉన్నాయి. 9 ఎపిసోడ్‌లూ బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా రాజకీయాల్లో కులాల ప్రాముఖ్యతను చాలా ఓపెన్‌గా చూపించడం గమనార్హం. ప్రతి పాత్రకు స్పష్టత ఉంది. దేవా కట్టా రైటింగ్, డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి.

నటులు:
ఆది పినిశెట్టి తన పాత్రలో ఇంటెన్సిటీ మెయింటేన్ చేశాడు. అయితే చంద్రబాబు లుక్‌ను పోలేదుగానీ, ఆలోచనా విధానాన్ని బాగా ప్రెజెంట్ చేశాడు. చైతన్య రావు నటన హైలైట్ – వైఎస్ పాత్రలో జీవించేశాడు. ఎన్టీఆర్ పాత్రలో సాయికుమార్ మెరిపించాడు. ఇతర నటులు కూడా తమ పాత్రల్లో న్యాయం చేశారు.

సాంకేతికంగా:
మయసభ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. 70-80 దశకాల వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ మినిమమ్ లెక్కల్లో సినిమాటిక్ ఫీల్‌ను అందించాయి.

ముగింపు:
మయసభ సిరీస్ ఓ పొలిటికల్ డ్రామా కేవలం గ్లామర్ కోసం కాకుండా, కథను, వాస్తవాలను, నాయకుల జీవితాలను సమతూకంగా చూపిస్తూ, ఆసక్తికరంగా నడిపిన ప్రామాణిక ప్రయత్నం. పొలిటికల్ కథలు, రియలిస్టిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఇది తప్పక చూసేయాల్సిన సిరీస్.

రేటింగ్- 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: