రాబోయే ఎన్నికల్లో వియ్యంకుడు కమ్ బావమరిది బాలకృష్ణ సన్నిహితునికి చంద్రబాబునాయుడు షాక్ తప్పేట్లు లేదు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ కదిరి బాబురావుకు చంద్రబాబు మొండిచేయి చూపించేట్లే ఉన్నారు. బాలయ్యకు బాబురావు చాలా సన్నిహితుడు. కేవలం బాలయ్య కారణంగానే రెండుసార్లు బాబురావు కనిగిరిలో టికెట్ దక్కించుకున్నారు. మొదటిసారి నామినేషన్ దశలోనే పోటీ నుండి పక్కకు తప్పుకున్నా రెండోసారి మాత్రం గెలిచారు.

 

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ? అందుకనే జిల్లాలోని నియోజకవర్గాల సమీక్ష మొదలుపెట్టారు. అందులో భాగంగానే కనిగిరి నియోజకవర్గం సమీక్ష కూడా జరిగింది. బాబురావుకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదని బాగా ప్రచారం జరుగుతోంది. అందుకనే బాబురావు టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. బాబురావుతో పాటు ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బాగా సన్నిహితుడైన ఉగ్రనరసింహారెడ్డి కూడా హాజరవ్వటమే పెద్ద ట్విస్టు.

 

ట్విస్టు ఏమిటంటే అసలు ఉగ్రనరసింహారెడ్డి టిడిపి నేతేకాదు. అయినా రెడ్డి సమీక్షకు ఎలా హాజరయ్యారో చంద్రబాబుకే తెలియాలి. పార్టీ మారిపోతారనే ప్రచారం జరుగుతున్న మాగుంటను టిడిపిలోనే అట్టి పెట్టుకోవాలంటే ఉగ్రకు టికెట్ ఇవ్వాలని షరతుపెట్టారు. అందుకే పార్టీ నేత కాకపోయినా ఉగ్రను సమీక్షకు పిలిపించారు. పైగా సమీక్ష అయిపోయిన తర్వాత సిట్టింగ్ ఎంఎల్ఏ ముందుగానే పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకోమని చంద్రబాబు చెప్పటంతో బాబురావుకు నోటమాట రాలేదు. దాంతో బాబురావుకు చంద్రబాబు చెయ్యిచ్చి ఉగ్ర నరసింహారెడ్డికే టికెట్ ఇవ్వబోతున్నట్లు  అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: