ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌పై  బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాబు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, ఆయనది పరిమిత పాత్ర అని స్ప‌ష్టం చేశారు. తన స్వంత అస్తిత్వం కోసం ప్రాకులాడుతున్నారు తప్ప వారు కింగ్‌మేకర్ లేదా నిర్ణయాత్మక శక్తిగా ఉండే అవకాశమే లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
ఈ నెల 19 వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయని పేర్కొన్న ద‌త్తాత్రేయ ప్రతిపక్షాలు మరియు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఎందుకు ఇంత తహతహలాడుతున్నాయి? అని ప్ర‌శ్నించారు. విశ్లేషణ రాకముందే వారు నిర్దారించుకోవడం ఎలా ఉందంటే 'ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో హంగ్ వస్తుందని, తాము నిర్ణయాత్మక శక్తిగా ఉంటామ‌ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, కేసీఆర్ పర్యటనలు వృథా ప్రయాసగానే మిగిలిపోతాయన్నారు. కేసీఆర్ క్రికెట్ ఆట మొదలవకముందే రెండు వికెట్లు కోల్పోయాయ‌ని,తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలను ఉద‌హ‌రిస్తూ ద‌త్తాత్రేయ వ్యాఖ్యానించారు. 
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ, ఎన్డిఏ కి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరిగిందని ద‌త్తాత్రేయ అన్నారు. ఈ కూటమి ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించిందని, బీజేపీ స్వంతంగా మెజారిటి సాధిస్తుందన్నారు. ఎన్డీఏ మరింత బలోపేతమవుతుందని, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. దేశాభివృద్ధికి, దేశ రక్షణకు, దేశ సమైక్యతకు ప్రాముఖ్యతనిస్తుంది. పేదలకు, రైతులకు, బడుగు బలహీనవర్గాలందరికి సమ్మిళిత అభివృద్ధి (Inclusive Growth) తో శక్తివంతంగా పరిపాలిస్తారు అవినీతిపరులు మరియు అక్రమంగా సంపాదించిన వారి భరతం పడతారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: