తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉదృతమవుతున్నది . కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం వైపు ఆలోచన చేయలేదు. దీంతో సమ్మె భవితవ్యమేమిటో అన్నది ప్రస్తుతం  ప్రశ్నార్థకంగా మారింది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ  సమ్మె విషయంలో  కొంచెం అయినా సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఇక ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో విచారణల  మీద విచారణలు  జరుగుతున్నప్పటికీ  కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేలా కనిపించడం లేదు. మీరు వాదించండి  మేము వాయిదా వేస్తాం  అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం హైకోర్టు పరిస్థితి. ఆర్టీసీ సమ్మె తో  రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు విషయంలో మాత్రం దిగిరావటం  లేదు. 

 

 

 

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయడంలో కాకుండా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం పై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాగా  ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో  43 రోజులకి  చేరుకుంది. దీంతో ఆర్టీసీ సమ్మె సరికొత్త రికార్డును సృష్టించింది. తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సమ్మెగా  ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డుకెక్కింది. గతంలో తెలంగాణ ఉద్యమం 2001 సంవత్సరంలో సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సమ్మెగా  సకల జనుల సమ్మె ఉండగా తాజాగా ఆర్టీసీ సమ్మె ఆ రికార్డును బద్దలు కొట్టింది.

 

 

 

 ఆర్టీసీ సమ్మె మొదలైన 43 రోజులు  అయినప్పటికీ కూడా అటు  ఆర్టీసీ కార్మికులు గాని ఇటు ప్రభుత్వం కాని ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే తాజాగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ మినహా మిగతా వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ  కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చలకు  ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పలు ఉద్రిక్త  పరిస్థితులకు దారితీసింది. కరీంనగర్ శివారులో గల కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. రవాణా శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు తమ నిరసన విషయంలో తమ నిర్ణయం మార్చుకున్నారు. ఎందుకంటే... భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నేడు నిరాహార దీక్షకు దిగనున్నట్లు ఆర్టీసీ జేఏసీ  ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని బస్సు రోకో  కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో అన్ని  డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: