జమ్మూకాశ్మీర్ మాజీముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోషియేషన్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. వీటి విలువ 11.86కోట్ల రూపాయలు. అటాచ్ చేసిన వాటిలో రెండు ఇళ్లు, ఒక కమర్షియల్ బిల్డింగ్, మూడు ప్లాట్లు ఉన్నాయి. మార్కెట్ లో వీటి విలువ 60 నుంచి 70కోట్ల రూపాయలుగా ఉంది.

జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోషియేషన్ లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 11.86కోట్ల రూపాయల విలువైన జమ్మూ, శ్రీనగర్ లో ఉన్న ఆయన ఆస్తులను మనీలాండరింగ్ కేసులో తాత్కాలికంగా జప్తు చేశారు అధికారులు. వీటిలో రెండు రెసిడెన్షియల్స్, ఒక వాణిజ్య ఆస్తి, మూడు ప్లాట్లు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును పరిగణలోకి తీసుకొని ఈడీ ముందుకెళ్లింది. ఫరూక్ తో పాటు మరో ముగ్గురిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది.

నేషనల్ కాన్ఫిరెన్స్ ఎంపీ అబ్దుల్లా మరో ముగ్గురిపై 2018లో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2002 నుంచి 2011 మధ్యకాలంలో 43.69కోట్ల రూపాయల మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఫరూక్ అబ్దుల్లా పలు మార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. చివరిసారి అక్టోబర్ లో శ్రీనగర్ లో ఎంక్వయిరీ కొనసాగింది. ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేశారు. ఇది కీలక పరిణామంగా మారింది. తర్వాత ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసే అవకాశముంది.

ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు పది మందికి జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల సంస్థగా మార్చేశారంటూ ఈడీ పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించి పలు బోగస్ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపించింది. అయితే కాశ్మీర్ కు తిరిగి ప్రత్యేక ప్రతిపత్తి సాధించేందుకు పీపుల్స్ అలయన్స్ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టన తర్వాతే ఈడీ చర్యలు మొదలయ్యాయని నేషనల్ కాన్ఫిరెన్స్ ఆరోపిస్తుంది. బెదిరింపు చర్యల్లో భాగంగానే తన తండ్రిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఫరూఖ్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసహనం వ్యక్తం చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: