అవ‌మానం నుంచి అధికారం వ‌ర‌కూ
ఆయ‌న ఉన్నారు
ఆ రోజు విప‌క్ష నేత హోదాలో ఉంటూ
చంద్ర‌బాబు నుంచి ఎన్నో ఛీత్కారాలు పొందారు
ఆ పగ నుంచి మ‌రియు ప్ర‌తీకారం నుంచి
ఆయ‌న త‌న‌ని తాను విజేత‌గా మ‌లుచుకుని  
కేంద్ర పెద్ద‌ల ఆశీస్సుల‌తో  ఆంధ్రావ‌ని ముఖ్య‌మంత్రిగా
దూసుకుపోతున్నారు..
స‌రే! మ‌రి! రాష్ట్రంలో ఈ అనిశ్చితి ఏంటి ? అవినీతి ఏంటి?

విప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ ఎన్నో అవ‌మానాలు పొందారు. అస‌లు ఆయ‌న‌ను ఓ విప‌క్ష నేత‌గా కాదు క‌దా సాటి మ‌నిషిగా కూడా టీడీపీ గుర్తించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో చాలానే వినిపించాయి. ఇదే క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు చాలా మంది టీడీపీ నుంచి అవ‌మానాలు పొందే ఉన్నారు. రోజా తో మొద‌లుకుని చెవిరెడ్డి వ‌ర‌కూ అంతా కూడా జ‌గ‌న్ వెనుకే న‌డిచి ఆ అవ‌మానాల‌ను స‌మానంగా పంచుకుని, ఇక శాస‌న స‌భ‌కు తాము వ‌చ్చేదే లేద‌ని తేల్చేసి స‌భ‌ను బ‌హిష్క‌రించి, ఏ మాట‌కు ఆ మాట తమ కోపం అంతా స్పీక‌ర్ పై రుద్దేసి, ఆ రోజు వెళ్లిపోయారు. ఆ త‌రువాత  స్పీక‌ర్ కు ఎటువంటి అవ‌మానం ప్ర‌జా క్షేత్రం లో జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు కోడెల‌కు భిన్నంగా స్పీక‌ర్ సీతారాం ఉన్నారా అంటే అదీ లేదు. ఆయ‌న మండ‌ల స‌మావేశాల‌కు సైతం వెళ్లి నానా హ‌డావుడి చేస్తున్నారు. ఆయ‌న భార్య వాణీ సీతారాం తాను ఓ సర్పంచ్ ను అన్న ఊసే మ‌రిచిపోయి అధికారుల‌పై పెత్తనం చెలాయిస్తున్నారు. పోనీ వీటినైనా ఆయ‌న నిలువ‌రించారా ? (ఆయ‌న అంటే  సీఎం జ‌గ‌న్ అని అర్థం) అంటే లేదు గాక లేదు.

ఇక జిల్లాల‌లో స‌మ‌స్య‌లు అలానే ఉన్నాయి. ప్ర‌గ‌తి లేదు ప్ర‌గ‌తి వాదం అమ‌లులో లేనేలేదు. కొత్త‌గా ప‌ద‌వులు అందుకున్న వారికీ అప్పుడే నాలుగు డ‌బ్బులు వ‌చ్చేయాల‌న్నా ఆత్రం ఉంది. ఇక సీనియ‌ర్ లీడ‌ర్ల సంగ‌తి సరేస‌రి!ఈ త‌రుణంలో ఇవాళ పుట్టిన్రోజు చేసుకుంటున్న వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మేల్కోవాలి. మేల్కొంటారా లేదా అన్న‌ది వేరే విష‌యం. పార్టీలో అంత‌ర్మ‌ర‌థ‌నాలు, అంత‌ర్గ‌త క‌ల్లోలాలు నివారించి, ప‌రిణితితో కూడిన నిర్ణ‌యాల‌నే వెలువ‌రించాలి. ఆ ప‌ని అధినేత హోదాలో జ‌గ‌న్ చేయ‌గ‌ల‌రా?  అదేవిధంగా ఎక్క‌డికక్క‌డ క్షేత్ర స్థాయిలో అవినీతి పెరిగిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారే అన్న విధంగా అవినీతిని పెంచి పోషిస్తున్నారు. అయినా కూడా సీఎం హోదాలో నిలువ‌రించాల్సిన లేదా నియంత్రించాల్సిన జ‌గ‌న్ ఆ ఊసే ఎత్త‌డం లేదు. ఎందుక‌ని?


మరింత సమాచారం తెలుసుకోండి: